తెలంగాణకు కేంద్రప్రభుత్వం అన్యాయం చేయదని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఉద్ఘాటించారు.
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో మన తెలంగాణ వాదాన్నిసీఎం రేవంత్‌రెడ్డి గట్టిగా వినిపించాలని కోరారు.
కేంద్రానికి రెండు రాష్ట్రాలు సమానమేనని నొక్కిచెప్పారు. బనకచర్ల ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకు జరిగే నష్టాన్ని సీఎం రేవంత్‌రెడ్డి వివరించాలని సూచించారు.
ఇవాళ(మంగళవారం) కరీంనర్‌లో బండి సంజయ్ పర్యటించారు. పలు కార్యక్రమాల్లో కేంద్రమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసే కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు.
రేవంత్ ప్రభుత్వం చేసే అన్యాయాన్ని బీసీ సంఘాలు ఎందుకు ప్రశ్నించడం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.
మాజీ సీఎం కేసీఆర్ చేసిన సమగ్ర సర్వేలో బీసీలు 51 శాతం.. కాంగ్రెస్ సర్వేలో మాత్రం 46 శాతమా అని ప్రశ్నించారు.
బీసీల్లో ముస్లింలను కలపడం ఏంటని నిలదీశారు. బీసీలకు మీరిచ్చేది కేవలం ఐదు శాతమేనని చెప్పుకొచ్చారు.
బీసీ ఆర్డినెన్స్‌ను తాము వ్యతిరేకించమని స్పష్టం చేశారు. బీసీల్లో ముస్లింలను కలిపితే ఆ ఆర్డినెన్స్‌ను మాత్రం అడ్డుకుంటామని హెచ్చరించారు.
బీసీలను రేవంత్ ప్రభుత్వం మోసం చేస్తోందని.. ఈ మోసంపై బీసీ సంఘాలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
బీసీల్లో ముస్లింలను కలిపితే.. కేంద్రప్రభుత్వం ఆమోదం తెలపదని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.

