శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి ప్రయాణికులతో వెళుతున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో కడపకు చెందిన ఒకరు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం తమిళనాడు సరిహద్దులో చోటుచేసుకుంది. కడప జిల్లా మండెం మండలానికి చెందిన అయ్యప్ప భక్తులు స్వామివారి దర్శనం కోసం కారులో శబరిమలకు బయలుదేరారు. వాహనం తమిళనాడు రాష్ట్రంలోకి ప్రవేశించి కొద్దిదూరం వెళ్లగానే అదుపు తప్పింది. వేగంగా పక్కనే ఉన్న లోయలోకి జారిపోయింది.
ఈ ప్రమాదాన్ని గమనించిన వాహనదారులు వెంటనే పోలీసులు, అంబులెన్సుకు సమాచారం అందించారు. కాగా, ఈ దుర్ఘటనలో కడపకు చెందిన కృష్ణ దుర్మరణం చెందగా, గోపాలు, కృష్ణయ్య, వెంకటమ్మ తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన తమిళనాడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల తమిళనాడులో జరిగిన మరో ప్రమాదంలో తెలంగాణకు చెందిన 10 మంది అయ్యప్ప భక్తులు ప్రాణాలు కోల్పోయిన సంగతి విదితమే.
బీజేపీకి ఈసారి తీవ్ర పరాభవం: చంద్రబాబు