రాష్ట్ర రాజధాని అంశంపై పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. విశాఖలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, గతంలో వచ్చిన శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణ కమిటీ నివేదికలను కూడా పరిశీలిస్తామని తెలిపారు. జీఎన్ రావు, బీసీజీ కమిటీల నివేదికలను పరిశీలించేందుకు హైపవర్ కమిటీ వేశామని వెల్లడించారు. హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికను క్యాబినెట్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలు, వనరులను భేరీజు వేసుకుని రోడ్ మ్యాప్ తయారుచేయాలనేది తమ ఆలోచన అని బొత్స స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం, నిరుద్యోగ సమస్య, ఇతర అంశాలను ఎలా చక్కదిద్దాలన్న ఉద్దేశంతోనే హైపవర్ కమిటీ వేశామని బొత్స వెల్లడించారు.
అభివృద్ది అంటే సచివాలయో, అసెంబ్లీనో కాదని, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలని, పరిశ్రమలు రావాలని, అభివృద్ధి అంటే అదేనని రైతుల వద్దకు వెళ్లి చెప్పింది చంద్రబాబేనని అన్నారు. విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయం ఉండాలని, అమరావతిలో అసెంబ్లీ, సీఎం క్యాంపు కార్యాలయం, గవర్నర్ కార్యాలయం ఉండాలని, కర్నూలులో హైకోర్టు ఉండాలని, అమరావతిలో హైకోర్టు బెంచ్, విశాఖపట్నంలో కూడా హైకోర్టు బెంచ్ ఉండాలని మొన్న వచ్చిన నివేదికల్లో పొందుపరిచారు.