తెలంగాణ రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయని విమర్శించారు. తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. రాష్ట్రంలో ప్రయివేట్ సంస్థలు కోట్లు గడిస్తుంటే, ఆర్టీసీ మాత్రం నష్టాల్లో కూరుకుపోయిందన్నారు.
రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందనన్నారు. తెలంగాణ సాధన కోసం ఆర్టీసీ కార్మికులు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారని, వారి జీవితాలిప్పుడు ప్రశ్నార్ధకంలో ఉన్నాయన్నారు. ప్రతి అంశాన్ని పొరుగు రాష్ట్రంతో పోల్చే సీఎం కేసీఆర్ ఏపీ ఆర్టీసీలో జరుగుతున్న సంస్కరణలు కనబడడం లేదా? అని లక్ష్మణ్ ప్రశ్నించారు. ఉద్దేశ్య పూర్వకంగానే ప్రభుత్వం ఆర్టీసీని నష్టాల్లో కురుకుపోయేలా చేస్తోందని విమర్శించారు. ప్రయివేట్ ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థకు అడ్డు అదుపు లేకుండా పోయిందని విమర్శించారు. టిఆర్ఎస్ ఏ మీటింగ్ పెట్టినా ఆర్టీసీ బస్సులను వాడుకొని డబ్బులు ఎగ్గొడుతోందని ఆయన ఆరోపించారు.