మన తెలుగువారు జరుపుకొనే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగ వస్తుందంటే చాలు.. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ప్రజలు ఈ పండుగను నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ముందు రోజు జరుపుకొనే పండుగ ‘భోగి’.
భోగభాగ్యాలు అందించే భోగి అనేది సంస్కృత పదం. దీన్నే భోగం అని కూడా అంటారు. భోగమంటే సుఖసంపదలు. ఇది కాలక్రమేనా భోగిగా మారింది. సూర్యుడు దక్షిణాయన సమయంలో భూమికి దూరంగా జరగడం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. దీనివల్ల చలి తీవ్రత పెరుగుతుంది. అందుకే.. అంతా ఆ రోజు చలిమంటలు వేస్తుంటారు. ఆవు పేడతో చేసిన పిడకలు, తాటాకులు, చెట్ల కర్రలను ఒకచోట వేసి..మంటలు వేస్తారు. ఇరుగుపొరుగు, చుట్టాలు పక్కాలు అంతా చుట్టూచేరి చలి మంటలు కాచుకుంటారు.
భోగి పండుగ విశిష్టత ..
మకర సంక్రాంతి పండుగను ఆహ్వానించే ముందుగా… భోగి పండుగ జరుపుతారు. తెల్లవారక ముందే లేచి అభ్యంగన మంగళ స్నానాలు చేసి భోగి మంటలు వేయాలి. ఈ మంటల వెనక ప్రత్యేక కారణం ఉంది. ఏడాది పాటూ ఇళ్లలో ఉండే పాత సామాన్లు, వాడని సామాన్లు, మూలన పడిన మంచాలు, ఇతర వాడని కలపను భోగి మంటల్లో వేస్తారు. తద్వారా ఇంట్లోని దరిద్రాన్ని వదిలించుకుంటారు. ఎప్పుడైతే దరిద్రం మంటల్లో కాలిపోతుందో… ఇళ్లు సరికొత్తగా మారుతాయి. ఇంటి ముందు రంగుల ముగ్గులు వేస్తారు. ఇళ్లను మామిడితోరణాలతో అలంకరిస్తారు. పిల్లల తలపై రేగి పండ్లు పోసి… చల్లగా ఉండమని ఆశీర్వదిస్తారు. ఇలా మకర సంక్రాంతి నాడు ఇళ్లకు కొత్త శోభ వస్తుంది.
భోగి పండుగను ఎలా జరుపుకోవాలి
భోగి నాడు ఉదయాన్నే చలిమంటలు కాచుకునే ప్రజలు తలస్నానం చేస్తారు. సూర్య భగవానుడికి నమస్కరిస్తారు. కొత్త బట్టలు వేసుకొని శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఇక ఈ పండుగకూ వ్యవసాయానికీ సంబంధం ఉంటుంది. రైతులు… తమ దిగుబడిని మార్కెట్లలో అమ్ముకొని… ఇంటికి కావాల్సిన సరుకుల్ని కొనుక్కుంటారు. అందువల్ల రైతుల జీవితాల్లో భోగి పండుగ ఆనందాన్ని తెస్తుంది. కొత్తగా పండించిన ధాన్యంతో వంటలు వండుతారు. బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల వారిని ఆహ్వానించి… అరటి ఆకుల్లో పాయసం, చక్కెర పొంగలి వంటివి పెడతారు. పిల్లలైతే పతంగులు ఎగరేస్తూ పండుగ చేసుకుంటారు.
కొత్త అల్లుళ్లకు స్వాగతం పలికే తోరణాలు..
ధాన్యపు రాసులతో నిండిన గోదాములు..
ముంగిట్లో అందమైన రంగలవల్లులు
చెడును దహించే భోగి మంటలు.
భోగాలను అందించే భోగి పండ్లు..
ఘుమఘుమలాడే పిండి వంటలు..
కీర్తనలు పాడే హరిదాసులు..
సంక్రాంతికి తెచ్చేను సందళ్లు..