బండి సంజయ్ కుమార్ మరోసారి సీఎం కేసీఆర్పై నిప్పులు చెరిగారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు బండి సంజయ్. “కేసీఆర్ మరోసారి ఉద్యోగస్తులను ప్రకటనలతో మోసం చేయాలని చూస్తున్నారు. వేతన సవరణ సంఘం పదవీకాలం రెండేళ్లు పూర్తి చేసుకున్నా.. డిసెంబరు 31న పదవీ కాలం ముగుస్తుందని తెలిసీ కూడా వేతన సవరణ సంఘం రిపోర్టు ఇవ్వకపోవడం తెలంగాణ ఉద్యోగులను మోసం చేయడమే. రెండు సంవత్సరాల పాటు పీఆర్సీ కమిషన్(వేతన సవరణ సంఘం) చేయని పనిని.. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ నాయకత్వంలో కొత్త కమిటీ చేస్తదట. రెండేళ్లలో చేయని పనిని చీఫ్ సెక్రటరీ రెండు నెలల్లో ఎలా పూర్తి చేస్తాడు..? మనతో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 27 శాతం మధ్యంతర భృతి ఇస్తుంటే.. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో కేసీఆర్ కనీసం జీతాలు కూడా ఇవ్వలేకపోతుండు. ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి .. ఉద్యోగస్తులను మచ్చిక చేసుకోవడం కోసం ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నడు. ఈయన బహురూపుల వేషాలను ఇక ఎవరూ నమ్మరు. పగలి వేషాలు వేసేవాళ్లు కూడా కేసీఆర్ ను చూసి నవ్వుకుంటున్నారు. గత ఆరేళ్ల నుంచి ఉద్యోగులను, నిరుద్యోగులను మోసం చేసిండు. ఈరోజు కేసీఆర్ చేసిన ప్రకటనలో కొత్తదేమీ లేదు. ఫిబ్రవరి లో ఎమ్మెల్సీ ఎన్నికలు రానున్నాయి కాబట్టి, ఎలాగూ ఎన్నికల కోడ్ వస్తది కాబట్టి.. ఆ పేరుతో తప్పించుకోవడం కోసం మరో నాటకమేస్తుండు. ఇప్పటికైనా ఉద్యోగులకు, నిరుద్యోగులకు న్యాయం చేయకపోతే నిన్ను బజార్ లో నిలబెడుతం. నీ వేషాలను బట్టబయలు చేస్తాం. కొందరిని కొంతకాలం మోసం చేయోచ్చేమో కానీ, అందరినీ అన్నిసార్లు మోసం చేయలేవు. నీ మోసపూరిత మాటలను ఎవ్వరూ విశ్వసించరు. కేసీఆర్..! ఉద్యోగస్తులకు పీఆర్సీ ఇచ్చేంతవరకు నిన్ను దోషిగా నిలబెడుతం. ఫిబ్రవరి గడువు పేరుచెప్పి తప్పించుకుంటే.. టీఆర్ఎస్ ను బొందపెట్టే వరకు నిద్రపోం.” అంటూ సీఎం కేసీఆర్పై ఫైర్ అయ్యారు బండి సంజయ్.
							previous post
						
						
					
							next post
						
						
					

