telugu navyamedia
తెలంగాణ వార్తలు

బండి సంజయ్ విడుదల..

ధర్మబద్ధంగా ఉద్యోగులకోసం జాగరణదీక్ష చేస్తుంటే… కేసీఆర్ సర్కారు అన్యాయంగా అరెస్టు చేసి ఇబ్బంది పెట్టాలని చూసిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హైకోర్టు తీర్పుతో స్వంత పూచీకత్తుపై విడుదలయ్యారు. కరీంనగర్ జిల్లా జైలునుంచి విడుదలైన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకోసం జైలుకెళ్లినా ఇబ్బంది లేదన్నారు. తెలంగాణ సమాజం అన్నీ గమనిస్తూనే ఉందన్నారు. ధర్మపోరాటానికే ప్రజల మద్దతు ఉంటుందని విశ్వసిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన గోతిని తానే తొవ్వుకుంటున్నాడని, ధర్మపోరాటంతో తెలంగాణలో ప్రజావిశ్వాసంతో అధికారాన్ని తెస్తామని ధీమా వ్యక్తంచేశారు.

జైల్లో ఉండగా తనకు సంఘీభావం తెలిపి, అండగా నిలిచిన భాజపా కేంద్ర నాయకత్వానికి, పార్టీ నాయకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బండి సంజయ్‌ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణను దోచుకుంటున్న కేసీఆర్ ను చూస్తూ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. వేల కోట్లు దోచుకుని అవినీతి కుబేరులుగా మారారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం చేసే తప్పిదాలను ప్రశ్నిస్తే జైలుపంపడమే గొప్పగా భావిస్తున్నారనీ, టీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలో ఉండొచ్చి… దేశాన్ని ఏలుతున్నది బీజేపీ అని గుర్తుపెట్టుకోవాలన్నారు.
కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా కరీంనగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో జాగరణ దీక్ష చేస్తుంటే… పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317ను రద్దుచేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

కళ్లెదుటే ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతుంటే… చూస్తూ ఊరుకోలేనన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దీక్ష చేస్తుంటే పోలీసులు అక్రమంగా కార్యాలయం ధ్వంసం చేసి, కార్యకర్తలను ఇష్టారాజ్యంగా కొట్టి అరెస్టుచేసి రాక్షసానందం పొందారని మండిపడ్డారు. తెలంగాణలో ప్రజలకు ఎక్కడ ఇబ్బందికలిగినా… బాధ్యతగా తీసుకుని వాటి పరిష్కారంకోసం పోరాడే విషయంలో వెనుకడుగు వేసేది లేదన్నారు. అధికారంలో ఉన్నా… లేకున్నా… ఉద్యోగులకు అండగా నిలుస్తామన్నారు.

Related posts