తెలంగాణ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ కుంతియాలే కారణమని మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ ఆరోపించారు. ఉత్తమ్, కుంతియాల వల్ల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదని అన్నారు. వాళ్ల అసమర్ధతను ప్రశ్నిస్తే దాడులు చేయించడానికి గాంధీభవన్‌లో రౌడీలను పెట్టుకున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓటమి కారకులే మళ్లీ ఓటమిపై సమీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఆదివారం గాంధీభవన్‌లో జరిగిన మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. ఈ సందర్బంగా సర్వే సత్యనారాయణ, పీసీసీ కార్యదర్శి బొల్లు కిషన్‌ల మధ్య వివాదం నెలకొంది. దీనిపై సర్వే సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. టీపీసీసీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొందరు రౌడీ మూకలు ఉన్నారని.. ఒకరిద్దరు దద్దమ్మలు తనపై దాడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలు చెబుతుంటే మహేశ్ గౌడ్, బొల్లి కిషన్‌లతో ఉత్తమ్ తనపై దాడి చేయించినట్టు ఆరోపించారు. టీకాంగ్రెస్‌లో ఏం జరుగుతుందో రేపు మరిన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.