telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారు: కేటీఆర్

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.

నిజం, ధర్మం కూడా బీఆర్ఎస్ పక్షానే ఉన్నాయని ఆయన అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్‌నగర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగిస్తూ, కాంగ్రెస్ పార్టీ గురించి, రేవంత్ రెడ్డి గురించి హైదరాబాద్ నగర ప్రజలకు బాగా తెలుసని, అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదని అన్నారు.

అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించిందని గుర్తుచేశారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలు సైతం ఇప్పుడు ఆగ్రహంతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కానీ, ఒక్క ముస్లిం ఎమ్మెల్సీ కానీ లేరని ఆయన విమర్శించారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో అజారుద్దీన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి పోటీ చేశారని, ఈసారి కూడా ఆయన టిక్కెట్ ఆశిస్తారని భావించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయనను తప్పించేందుకు కేవలం కాగితంపై ‘ఎమ్మెల్సీ’ అని రాసి మోసం చేశారని విమర్శించారు.

అజారుద్దీన్‌కు ఇచ్చే ఎమ్మెల్సీ నిలబడదని రేవంత్ రెడ్డికి తెలుసని అన్నారు. ఈ విషయం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని ఆయన తెలిపారు.

షేక్‌పేటలో కబరస్థాన్‌కు ఇచ్చిన స్థలం కూడా ఆర్మీకి చెందినదని, అది కూడా కోర్టులో నిలబడదని ఆయన అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అని చెప్పారని, అది కూడా కోర్టులో నిలబడలేదని గుర్తు చేశారు.

రేవంత్ రెడ్డికి అన్నీ తెలిసినా ప్రజలను మోసం చేయడానికి ఇలాంటి పనులు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

బీసీలను, మైనార్టీలను ముఖ్యమంత్రి మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు గట్టిగా బుద్ధి చెబితే, ఢిల్లీలోని అధిష్ఠానం సైతం ఉలిక్కిపడుతుందని వ్యాఖ్యానించారు.

Related posts