telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ లోకి కరోనా రావడానికి ఆ నిర్లక్ష్యమే కారణమా…?

new feature in ipl 2020

అనూహ్య ప‌రిస్థితుల్లో ఐపీఎల్ 2021ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ పేర్కొంది. కేకేఆర్, సీఎస్‌కే, ఎస్‌ఆర్‌హెచ్, ఢిల్లీ జట్లలోని ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బంది వైరస్ బారిన పడడంతో.. అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన బీసీసీఐ ముందు జాగ్రత్తగా లీగ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అత్యంత సురక్షితమని భావించిన బయో బబుల్‌లో పాజిటివ్‌ కేసులు బయటపడడం అనేక అనుమానాలకు తావిస్తోంది. లీగ్‌ మధ్యలో కరోనా కేసులు ఎలా వెలుగు చూశాయన్నది ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. అయితే బీసీసీఐ బోర్డు చేసిన తప్పిదాల కారణంగానే బుడగ బద్దలైందని సమాచారం. బబుల్‌ లేకపోవడం వల్లే ఐపీఎల్ 2021 అర్ధంతరంగా ఆపేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం అందరికీ కలిపి ఉమ్మడి బయో బబుల్‌ ఏర్పాటు చేయకపోవడమే అసలు సమస్య. ఆయా ఫ్రాంఛైజీలు తమ తమ పరిధిలో బబుల్‌ ఏర్పాటు చేసుకున్నాయి. మైదానాలకు, జట్లు బస చేసే హోటళ్లకు మధ్య ఎక్కువ దూరం ఉండటం.. హోటళ్ల సిబ్బందిపై పర్యవేక్షణ కొరవడటం, వారికి నిర్బంధ క్వారంటైన్‌ లేకపోవడం.. అలాగే మైదానాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న సిబ్బందిలో ఎవరూ బబుల్‌ నిబంధనలు పాటించకపోవడం లాంటివి ఆటగాళ్లకు కరోనా సోకేలా చేసింది. ఐపీఎల్ 2021ను ఒకట్రెండు వేదికలకు పరిమితం చేయకుండా.. ఆరు నగరాలను ఎంపిక చేయడంతో మధ్యలో మూడుసార్లు ఆటగాళ్లు, సిబ్బంది ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. చెన్నై, ముంబైల్లో మ్యాచ్‌లు అయ్యాక అందరూ విమానాల్లో ప్రయాణాలు చేసిన కొన్ని రోజులకే కరోనా కేసులు బయటపడటాన్ని బట్టి ఆ సమయంలోనే వైరస్‌ వ్యాప్తి జరిగి ఉండొచ్చు. ఇక వారం రోజుల క్రితం వరకు కూడా క్రికెటర్లు తాము ఉంటున్న నగరంలో ఎక్కడి నుంచైనా నచ్చిన భోజనాన్ని ఆన్‌లైన్‌ ఆర్డర్‌ ద్వారా తెప్పించుకునే అవకాశం కల్పించారు. మరోవైపు నిబంధనలు పాటించకుండా బయటి వ్యక్తులు కూడా క్రికెటర్లను కలవగలిగారని తెలుస్తోంది.

Related posts