పౌర ప్రకంపనలు విశ్వవిద్యాలయాలకు పాకాయి. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) విశ్వవిద్యాలయంలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్న తరుణంలో పోలీసులు లాఠీ ఛార్జీ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, జేఎంఐ విద్యార్థులకు సంఘీభావం ప్రకటిస్తూ, ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ విద్యార్థులు చేపట్టిన నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఈ కార్యక్రమం సందర్భంగా పోలీసులతో విద్యార్థులు గొడవ పడ్డారు.
విద్యార్థులను నియంత్రించేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో, అలీగఢ్ లో నిన్న రాత్రి 10 గంటల నుంచి ఈ రోజు రాత్రి 10 గంటల వరకు ఇంటర్నెట్ సేవలను ఆపేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ నిన్న రాత్రి ప్రకటించారు. మరోవైపు, యూనివర్శిటీని తక్షణం అందరూ ఖాళీ చేయాలని ఉత్తరప్రదేశ్ డీజీపీ ఆదేశించారు. యూనివర్శిటీని జనవరి 5వ తేదీ వరకు మూసి వేస్తున్నట్టు ప్రకటించారు. విద్యార్థులందరినీ ఇంటికి పంపే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.

