telugu navyamedia
రాజకీయ వార్తలు

మమతా-గవర్నర్ మధ్య .. ముదిరిన మాటల యుద్ధం..

west bengal governor fire on mamata

బెంగాల్ గవర్నర్, అధికార టీఎంసీ మధ్య యుద్ధం తార స్థాయికి చేరుకుంది. అసెంబ్లీని సందర్శిస్తారని గవర్నర్ రెండురోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. అధికార పక్షం సభను అకస్మాత్తుగా వాయిదా వేసింది. రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా బెంగాల్ గవర్నర్‌కు చేదు అనుభవం ఎదురైంది. పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌ శాసనసభను సందర్శించేందుకు రాగా.. గేటుకు తాళం వేసి కన్పించింది. దీంతో మీడియా వ్యక్తులు, అధికారుల కోసం ఏర్పాటుచేసిన మరో గేట్‌ నుంచి ఆయన లోపలికి వెళ్లాల్సి వచ్చింది. తీవ్ర అసహనానికి గురైన గవర్నర్‌.. బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వంపై మండిపడ్డారు. గత మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులకు గవర్నర్‌ నుంచి ఆమోదం లభించలేదు. దీంతో సభను రెండు రోజుల పాటు అంటే డిసెంబరు 5 వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ బీమన్‌ బెనర్జీ ప్రకటించారు. గురువారం తాను అసెంబ్లీని సందర్శిస్తానని, అక్కడి సౌకర్యాలను పరిశీలిస్తానని గవర్నర్‌ జగదీప్‌.. లేఖ ద్వారా స్పీకర్‌కు సమాచారమిచ్చారు.

నిబంధనల ప్రకారం.. గవర్నర్‌ రాకపోకల కోసం శాసనసభ గేట్‌ నంబరు 3ని కేటాయించారు. అయితే గురువారం ఉదయం గవర్నర్‌ జగదీప్‌ అసెంబ్లీ వద్దకు రాగా.. మూడో నంబరు గేటుకు తాళం వేసి కన్పించింది. దీంతో ఆయన ఆగ్రహానికి గురయ్యారు. గేటు ముందే మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. శాసనసభకు వస్తానని ముందే చెప్పినా గేటుకు ఎందుకు తాళం వేశారని గవర్నర్‌ ప్రశ్నించారు. సమావేశాలు జరగట్లేదంటే దానర్థం అసెంబ్లీని మూసివేయడం కాదని దుయ్యబట్టారు. ఇది ప్రజాస్వామ్య భారతానికి సిగ్గుచేటని విమర్శించారు. బెంగాల్‌లో గవర్నర్‌, ప్రభుత్వానికి మధ్య వాగ్వాదం జరుగుతున్న తరుణంలో.. ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

Related posts