వెస్టిండీస్ టీ20 సారథి కీరన్ పొలార్డ్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ నుంచి కుర్రాళ్లు జాతీయ జట్టులోకి రావడం ఆనందంగా ఉందన్నాడు. తమ ప్రతిభను ప్రదర్శించాలని వారు తహతహలాడుతున్నారని వెల్లడించాడు. ఆ జట్టు డిసెంబర్ 6 నుంచి టీమిండియాతో టీ20, వన్డే సిరీసులు ఆడుతున్న సంగతి తెలిసిందే. బ్రాండన్ కింగ్, ఖారీ పెర్రీ, షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్, కెసెరిక్ విలియమ్స్, హైడెన్ వాల్ష్ జూనియర్ వంటి కుర్రాళ్లను టీమిండియా పర్యటన కోసం విండీస్ ఎంపిక చేసింది. బ్రాండన్ కింగ్, కెసెరిక్ విలియమ్స్ బాగున్నారు. కుర్రాళ్లు విండీస్‌కు ప్రాతినిధ్యం వహించాలని ఉవ్విళ్లూరుతున్నారు. కానీ త్వరగా ఓ అంచనాకు రావడమే మనం చేస్తున్న తప్పు. మనకు సహనం అవసరం. ఏదేమైనా మనకు ఫలితాలు ముఖ్యం. ఈ యువ ప్రతిభావంతులపై రాబందుల ప్రభావం పడకుండా చూడాలి. వారికి అనుభవం అవసరం. వారికి మేం మద్దతివ్వాలి. మా అనుభవాన్ని పంచుకోవాలి. అంతర్జాతీయ క్రికెట్లో ఎంతదూరం ప్రయాణించగలరో చూడాలని పొలార్డ్ అన్నాడు.
కోహ్లీసేనతో హోరాహోరీగా పోటీపడేందుకు తమ అనుభవాన్ని ఉపయోగించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశాడు పోలార్డ్. మేం భారత్‌లో చాలా క్రికెట్ ఆడాం. మా అనుభవాన్ని ఉపయోగించుకుంటాం. మేం చక్కని క్రికెట్ ఆడతాం. బాగా సన్నద్ధమయ్యాం. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడటం ముఖ్యం. నవంబర్ నుంచి మేమిక్కడే ఉండటం కలిసొచ్చే అంశం. ఈ సారి మేం గట్టిపోటీనిస్తాం. టీమిండియా అగ్రశ్రేణి జట్టు. ప్రాథమిక అంశాలపై దృష్టిపెడతాం. వ్యక్తిగతంగా కాకుండా జట్టుగా మా క్రికెట్‌ను మెరుగు పరుచుకొనేందుకు శ్రమిస్తాం. నరైన్, రసెల్, బ్రావో వంటి సీనియర్ల లోటును పూడ్చడం కష్టం. కానీ జట్టుగా మేం ఆ పని చేస్తాం. ఒకరికొకరం మద్దతిచ్చుకుంటూ ముందుకు సాగుతాం. సెలక్షన్‌కు సీనియర్లు అందుబాటులో ఉన్నప్పుడు ఏం చేయాలన్నది ఆలోచిస్తాం అని పొలార్డ్ తెలిపాడు.
టీటీడీకొచ్చే ఆదాయంపై ..టీజీ వెంకటేశ్ సంచలన వ్యాఖ్యలు