telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆర్టీసీ డ్రైవర్ బాబు అంత్యక్రియలు.. చర్చల తరువాతే చేస్తాం.. : భార్య జయ

funeral of rtc driver babu is after

ఆర్టీసీ డ్రైవర్ బాబు మృతితో కరీంనగర్ రగిలిపోతోంది. ఆర్టీసీ కార్మికులు 28 రోజులుగా సమ్మె చేస్తున్న పట్టించుకోని ప్రభుత్వ వైఖరిపై అటు ఆర్టీసీ కార్మిక జెఎసి, ప్రతిపక్ష పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికి కార్మికుల సమ్మె పై సర్కారు తీరు వల్ల 17 మంది మరణించారు. ఈ మరణాలు ఇక్కడితో ఆగాలని, తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయం తీసుకుంది ఆర్టీసీ కార్మిక జేఏసీ. అంతేకాదు చర్చలు మొదలు పెట్టాకే డ్రైవర్ బాబు అంత్యక్రియలు ప్రారంభిస్తామని అటు ఆర్టీసీ కార్మిక జే.ఏ.సి,మృతిచెందిన ఆర్టీసీ డ్రైవర్ బాబు భార్య జయ తెలంగాణ సర్కార్ పై పోరాటానికి సిద్ధమయ్యారు. ఆర్టీసీ కార్మిక జే.ఏ.సి, ప్రతిపక్ష పార్టీల నాయకులు అందరూ కరీంనగర్ కు చేరారు.

ఆర్టీసీ కార్మికులు తీవ్రమైన మనోవేదనకు గురి అవుతూ పిట్టల్లా రాలిపోతున్నా పట్టింపులేనట్టు వ్యవహరిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఈ మరణాలకు అడ్డుకట్ట వేయాలని, కరీంనగర్లో డ్రైవర్ బాబు మరణం చివరి మరణం కావాలని గట్టిగానే రణం చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఆర్టీసీ కార్మికులు, కార్మిక కుటుంబాలు, ప్రతిపక్ష పార్టీలు. అందుకే డ్రైవర్ బాబు అంత్యక్రియలు నిర్వహించాలంటే, ప్రభుత్వం చర్చలు జరపాలి అన్న డిమాండ్ ను తెరమీదకు తీసుకువచ్చారు. డ్రైవర్ బాబు మరణం చివరి మరణం కావాలని, మరొక కార్మికుడు చనిపోవడానికి వీల్లేదని మృతి చెందిన డ్రైవర్ బాబు భార్య జయా అంటున్నారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్చలు జరిపే వరకు, సమస్య పరిష్కారం అయ్యేవరకూ మృతదేహాన్ని తియ్యమని తేల్చి చెబుతున్నారు. తన భర్త మృతి పట్ల కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు జయ.

Related posts