మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్‌కు బిగ్ షాక్ తగిలింది. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌కు రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ నెల 13 వరకు రిమాండ్ విధిస్తున్నట్టుగా తెలిపింది. జోగి రమేష్‌తో పాటు ఆయన సోదరుడు జోగి రాముకు కూడా కోర్టు రిమాండ్ విధించింది.
నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్దన్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు మరింత విచారణ చేపట్టారు.
ఈ క్రమంలోనే పలు ఆధారాలు సేకరించిన పోలీసులు జోగి రమేశ్ ను అరెస్ట్ చేశారు.
ఆదివారం తెల్లవారుజామునే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ నివాసానికి ఎక్సైజ్ శాఖ, నకిలీ మద్యం కేసును విచారిస్తున్న సిట్, స్థానిక పోలీసులతో కూడిన సంయుక్త బృందం వెళ్లింది.
అయితే తొలుత ఇంటిని సెర్చ్ చేయనున్నట్టుగా నోటీసులు ఇచ్చారు.
ఆ తర్వాత జోగి రమేష్‌ను, ఆయన సోదరుడు జోగి రామును పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ మేరకు కుటుంబ సభ్యులకు అరెస్ట్ నోటీసు అందించారు. అరెస్టు తర్వాత జోగి రమేష్‌ను విజయవాడలోని గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకెళ్లారు.
అక్కడ దాదాపు 10 గంటలకు పైగానే జోగి రమేష్‌ను సిట్ అధికారులు ప్రశ్నించారు.
మరోవైపు జోగి రామును కూడా పోలీసులు విచారించారు. నకిలీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న జనార్దన్ రావుతో పరిచయం, సంబంధాల గురించి వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు.
విచారణ అనంతరం జోగి రమేష్, రాములను వైద్య పరీక్షలకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం వారిని న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు.
అయితే జోగి రమేష్‌ను జ్యుడిషియల్ రిమాండ్‌కు పంపాలని సిట్ అధికారులు న్యాయమూర్తిని కోరారు.
ఈ క్రమంలోనే జోగి రమేష్, రాములకు ఈ నెల 13 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు వెలువరించారు. దీంతో జోగి రమేష్, జోగి రాములను విజయవాడ జైలుకు తరలించారు.
ఈ కేసులో నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పేరును ఏ-18 గా, ఆయన సోదరుడు జోగి రామును ఏ-19 గా అధికారులు పేర్కొన్నారు.

