మంగళవారం మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అంతర్వేదిలో రథం కాల్చివేశారని నాయుడుపేటలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని దెబ్బతీశారని భగవంతుడికి భద్రత లేకుండా గతప్రభుత్వం పాలన సాగిందని మండిపడ్డారు.
అనేక దుర్మార్గాలు చేశారని సనాతన ధర్మాన్ని మంట కలిపారని విమర్శించారు. ప్రస్తుతం అందరూ పవిత్రంగా ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు.
దేవాదాయ శాఖ పరిరక్షణ కోసం కంకణం కట్టుకుని పని చేస్తున్నామన్నారు. విజయవాడ దుర్గా ఆలయంలో దేదీప్యంగా పూజలు జరుగుతున్నాయని భక్తులకు వసతులు కల్పిస్తున్నామని చెప్పారు.
అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.
వేదాన్ని రక్షించుకోవాలని, నేర్చుకున్న వారికి వేతనం ఇస్తున్నామని తెలిపారు.
పాలకవర్గం, అధికారులు.. ఆగమ పండితుల ఆదేశాల మేరకే పని చేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. పూజలు లేని ఆలయాలను దూపదీప నైవేద్యం పథకం కింద పరిరక్షిస్తున్నామని తెలిపారు.
భగవన్ నామస్మరణ కోసం ఆలయాలు అభివృద్ధి చేస్తున్నామన్నారు. దేవాదాయశాఖను ప్రక్షాళన చేస్తున్నామని 476 ఆలయాలకు పాలకవర్గం ఏర్పాటు చేశామని మంత్రి వెల్లడించారు.
రూ.20 కోట్లు ఆదాయం ఉన్న ఆలయాలు ఎనిమిది ఉన్నాయని పాలకవర్గం నియామకానికి ఉత్తర్వులు ఇచ్చామన్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు బాగోలేవని మతాన్ని తప్పుపట్టే విధంగా ప్రకటన చేయడం దురదృష్టకరం, బాధాకరమన్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇద్దరు బిడ్డలు హిందూమతాన్ని విమర్శించడం బాధాకరమన్నారు.
హిందూ మతాన్ని కించపరిచేలా రాష్ట్రంలో జగన్ పాలన సాగిందని వ్యాఖ్యలు చేశారు. హిందూధర్మాన్ని సనాతన ఆచారాలు మరిచిపోయారన్నారు.
ఆలయాలకు బదులుగా టాయిలెట్లు కట్టమంటూ కించపరిచే విధంగా మాట్లాడటానికి సిగ్గుగా లేదా అంటూ ఫైర్ అయ్యారు.
1000 ఆలయాలు కట్టిస్తామని తాము చెబితే, షర్మిల టాయిలెట్లు కట్టమని మాట్లాడటం హిందువులని కించపరిచడమే అని అన్నారు.