శ్రీలంక నావికా దళం అరెస్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు మత్స్యకారులు స్వదేశానికి చేరుకోనున్నారు.
శుక్రవారం సాయంత్రం శ్రీలంక నుంచి భారత్‌కు వారు చేరుకోనున్నారు. అనంతరం వారిని స్వస్థలాలకు పంపేందుకు టీడీపీ ఎంపీ సానా సతీష్ ఏర్పాట్లు చేశారు.
శనివారం వారు కాకినాడ చేరుకుంటారని ఎంపీ సానా సతీష్ వివరించారు. కాకినాడకు చెందిన నలుగురు మత్స్యకారులు.. శ్రీను, వెంకటేశ్వర్, నూకరాజ్, చందా నాగేశ్వరరావు, బ్రహ్మనందం.. ఫిషింగ్ ట్రాలర్ కొనుగోలు నిమిత్తం తమిళనాడులోని నాగపట్నంకు వెళ్లారు.
అనంతరం వారు తిరుగు ప్రయాణంలో నావిగేషన్ లోపం కారణంగా శ్రీలంక ప్రాదేశిక సముద్ర జలాల్లోకి ప్రవేశించారు.
దీంతో శ్రీలంక నావికాదళం సిబ్బంది వీరిని అరెస్ట్ చేసింది.
అనంతరం వారిని జాఫ్నా జైలుకు తరలించారు. ఈ ఘటన ఆగస్టు మొదటి వారంలో చోటు చేసుకుంది.
ఈ విషయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఎంపీ సానా సతీష్ తీసుకు వెళ్లారు.
వెంటనే సీఎం చంద్రబాబు రంగంలోకి దిగి న్యూఢిల్లీలో ఏపీ రెసిడెన్స్ కమిషనర్ అర్జా శ్రీకాంత్‌తో మాట్లాడి వారి విడుదలకు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు.
అర్జా శ్రీకాంత్ ఇండియా కోస్ట్ గార్డ్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో ఆయన పలు దఫాలుగా చర్చలు జరిపారు.
ఈ సందర్బంగా మత్స్యకాారుల పరిస్ధితిని వారికి వివరించారు. దీంతో వారి విడుదలకు మార్గం సుగమం అయింది.