అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని మున్సిపల్, సచివాలయం అధికారులను మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
పలు అభివృద్ధి పనులపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సకాలంలో పనులు ఎందుకు పూర్తి చేయడం లేదని సంబంధిత అధికారులపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యుత్ దీపాల నిర్వహణ, తాగునీటి సరఫరాలో అధికారులు ఎందుకు అలసత్వం వహిస్తున్నారని ప్రశ్నించారు. అధికారులు ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నంలోని వడ్డెరగూడెంలో ఇవాళ(బుధవారం) మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజాసమస్యలను అడిగి మంత్రి తెలుసుకున్నారు.
వీధి దీపాలు వెలగడం లేదని, తాగునీరు దుర్వాసన వస్తోందని మంత్రికి పలువురు మహిళలు ఫిర్యాదు చేశారు. నెలల తరబడి వీధి దీపాలు వెలగడం లేదని మహిళలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
ప్రజా సమస్యలు పరిష్కరించకుండా అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తక్షణం వీధి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ని ఆదేశించారు.
స్వచ్ఛమైన తాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు.