telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని కేవలం రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు: మంత్రి పయ్యావుల కేశవ్

బనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని బీఆర్ఎస్ కేవలం రాజకీయ లబ్ధి కోసమే తెరపైకి తెచ్చిందని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రంగా విమర్శించారు.

బీఆర్ఎస్ లో నెలకొన్న అంతర్గత పోరులో భాగంగానే కొందరు నేతలు తమ ఉనికిని కాపాడుకోవడానికి ఈ వివాదాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు.

అనంతపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

బనకచర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు చేస్తున్న విమర్శల వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని పయ్యావుల అన్నారు. “బీఆర్ఎస్ లో అంతర్గత సమస్యలు నడుస్తున్నాయి.

అందులో భాగంగానే హరీశ్‌ రావు తన ఉనికిని చాటుకోవడానికి బనకచర్ల అంశాన్ని వాడుకుంటున్నారు. ఇది పూర్తిగా ఆయన సృష్టిస్తున్న రాజకీయ డ్రామా. మిగతా నేతలు కూడా ఆయన ట్రాప్‌లో పడి మాట్లాడుతున్నారు” అని పయ్యావుల వివరించారు.

ఇదే అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఎక్కడా స్పందించకపోవడాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ఇది వారి అంతర్గత గొడవేనని స్పష్టం చేశారు.

బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి నష్టమూ వాటిల్లదని మంత్రి పయ్యావుల కేశవ్ హామీ ఇచ్చారు. “కిందకు వృథాగా పోయే నీటిని మాత్రమే వాడుకుంటున్నాం.

దీనివల్ల ఎగువ రాష్ట్రాలకు ఏమాత్రం ఇబ్బంది ఉండదు.

ఈ విషయం తెలిసి కూడా కేవలం రాజకీయ ఉద్దేశాలతోనే బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు” అని ఆయన అన్నారు.

గతంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కూడా పయ్యావుల ఈ సందర్భంగా గుర్తుచేశారు.

“రాయలసీమకు గోదావరి జలాలు రావాలని గతంలో కేసీఆర్ స్వయంగా చెప్పలేదా?” అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

ఇప్పుడు ఆయన పార్టీ నేతలే అందుకు విరుద్ధంగా మాట్లాడటం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని పయ్యావుల విమర్శించారు.

అనవసర వివాదాలు సృష్టించి రెండు రాష్ట్రాల మధ్య అపోహలు పెంచవద్దని ఆయన హితవు పలికారు.

Related posts