మీమీ రాష్ట్రాల్లో కనీసం ఒక్కో వరల్డ్ క్లాస్ టూరిస్ట్ ప్లేస్ ఏర్పాటు చేయండని దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ సూచించారు.
రాష్ట్రాల్లో పర్యాటక కేంద్రాన్ని ప్రపంచ ప్రమాణాల ప్రకారం అభివృద్ధి చేయాలని మోదీ అన్నారు.
మనం కలిసి పనిచేస్తే ఏదీ అసాధ్యం కాదన్న ప్రధాని మోదీ కేంద్ర రాష్ట్రాలు కలిసి చేస్తే ఏ లక్ష్యం అసాధ్యం కాదని నొక్కి చెప్పారు.
ఈరోజు ఢిల్లీలో నిర్వహించిన నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘వికసిత్ రాజ్య ఫర్ వికసిత్ భారత్@2047’ అనే అంశంపై నేడు (మే 24)న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన 10వ నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.
“మనం అభివృద్ధి వేగాన్ని పెంచాలి. కేంద్రం, అన్ని రాష్ట్రాలు కలిసి వచ్చి టీం ఇండియా లాగా కలిసి పనిచేస్తే, ఏ లక్ష్యం అసాధ్యం కాదు” అని నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశానికి అధ్యక్షత వహించిన మోదీ అన్నారు.
‘వికసిత్ రాజ్య ఫర్ వికసిత్ భారత్@2047’ అనే థీమ్‌తో ఈ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో, ‘వికసిత్ భారత్'(అభివృద్ధి చెందిన భారతదేశం)ప్రతి భారతీయ పౌరుడి లక్ష్యమని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.
“ప్రతి రాష్ట్రం వికసిత్ అయినప్పుడు, భారతదేశం వికసిత్ అవుతుంది. ఇది 140 కోట్ల మంది పౌరుల ఆకాంక్ష” అని మోదీ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ ప్రమాణాల ప్రకారం తమ రాష్ట్రంలో కనీసం ఒక టూరిజం డెస్టినేషన్ (పర్యాటక గమ్యస్థానానం) అభివృద్ధి చేయాలని మోదీ అన్నారు.
“రాష్ట్రాలు ప్రపంచ ప్రమాణాలకు సమానంగా, అన్ని సౌకర్యాలు, మౌలిక సదుపాయాలను అందించడం ద్వారా ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక పర్యాటక గమ్యస్థానాన్ని అభివృద్ధి చేయాలి.
ఒక రాష్ట్రం ఒక ప్రపంచ గమ్యస్థానం కావాలి. ఇది పొరుగున ఉన్న నగరాలను పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేయడానికి కూడా దారితీస్తుంది” అని మోదీ అన్నారు.
‘దిల్ సే రిష్ట బనాయా’ అని ప్రధాని అన్నారు. ఈశాన్య భారతం ఇప్పుడు భారతదేశ వృద్ధిలో ముందంజలో ఉందన్నారు. మహిళలను శ్రామిక శక్తిలో మరింతగా చేర్చాలని కూడా ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
“వారు శ్రామిక శక్తిలో గౌరవంగా కలిసిపోయేలా మనం చట్టాలు, విధానాలను రూపొందించాలి” అని ఆయన అన్నారు.
నీతి ఆయోగ్ అత్యున్నత సంస్థ అయిన పాలక మండలిలో అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, అనేక మంది కేంద్ర మంత్రులు ఉన్నారు.
ప్రధాన మంత్రి మోదీ దీనికి చైర్పర్సన్. ఆపరేషన్ సింధూర్ తర్వాత అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో ప్రధాన మంత్రికి ఇది మొదటి కీలక సమావేశం.
కాగా, న్యూఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ నీతి ఆయోగ్ సమావేశానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరు కాలేదు.