telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

సామాజిక మార్పులు ఎన్నో జరగాల్సి ఉంది: ప్రధాని మోదీ

modi speech on J & K

లాక్‌డౌన్‌ను పొడిగించాలంటూ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు, ఇతర పార్టీల ముఖ్యనేతలో ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడున్నట్టుగా ఇకపై జీవితం ఉండబోదని అభిప్రాయపడ్డారు.

వ్యక్తిగత ప్రవర్తన, సామాజిక మార్పులు ఎన్నో జరగాల్సి ఉందని పేర్కొన్నారు. లాక్‌డౌన్ ఎత్తేసే విషయంలో మోదీ అంత సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ప్రజల ప్రాణాలను కాపాడుకోవాలంటే లాక్‌డౌన్ ఒక్కటే ఏకైక పరిష్కారమని ఫ్లోర్ లీడర్లతో మోదీ అన్నట్లు సమాచారం.

కరోనా వైరస్ కట్టడికి చేపడుతున్న చర్యల గురించి కేంద్ర వైద్య, హోం, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖల కార్యదర్శులు పార్టీ నేతలకు వివరించారు. వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ సామగ్రి (పీపీఈ) కొరతకు సంబంధించిన అంశం ఈ సమావేశంలో నేతలు ప్రస్తావించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో టీఆర్ఎస్, వైసీపీ, సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్ పార్టీ, లోక్‌ జన్‌శక్తి పార్టీ, డీఎంకే, శిరోమణి అకాలీదళ్, జనతాదళ్ యునైటెడ్, బిజూ జనతాదళ్, శివసేన నేతలు పాల్గొన్నారు.

Related posts