telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్ లో జరగనున్న ప్రతిష్ఠాత్మక మిస్ వరల్డ్-2025 పోటీల ఏర్పాట్లపై అధికారుల తో రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం

ప్రతిష్ఠాత్మక మిస్ వరల్డ్ – 2025 పోటీలకు హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించింది.

ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.

పోటీల నిర్వహణకు సంబంధించి జరుగుతున్న సన్నాహక పనులను అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు.

మే 10వ తేదీ నుంచి మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కానున్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు.

ఈ నేపథ్యంలో, పోటీల్లో పాల్గొనేవారికి, హాజరయ్యే దేశ, విదేశీ అతిథులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

వారి బస, ప్రయాణం వంటి విషయాల్లో లోటుపాట్లు ఉండకూడదని స్పష్టం చేశారు.

అంతర్జాతీయ స్థాయి కార్యక్రమం కావడంతో భద్రతాపరమైన అంశాలపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు.

ముఖ్యంగా విమానాశ్రయం, అతిథులు బస చేసే హోటళ్లు, వారు సందర్శించే అవకాశం ఉన్న చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

నగరానికి వచ్చే అతిథులు హైదరాబాద్లోని పర్యాటక ప్రదేశాలను సందర్శించేలా అనువైన ఏర్పాట్లు చేయాలని కూడా ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Related posts