telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణలో భారీ వర్షాలు: విద్యాసంస్థలకు మూడు రోజుల సెలవులు

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో రేపటి నుంచే మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం.

రాష్ట్రంలో వర్షాల పరిస్థితి, చేపట్టిన చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి రెడ్ అలెర్ట్ జారీ అయింది. గత మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. మూడు రోజులుగా హైదరాబాద్‌లో జల్లులు కురుస్తూనే ఉన్నాయి. గత రెండు రోజుల్లో హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా అధికారులు తెలిపారు.

వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో మాన్ సూన్ టీమ్‌లు, విపత్తు స్పందక టీమ్‌లను అప్రమత్తం చేశారు.

అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు

రాష్ట్రంలో మూడు రోజులుగా వర్షాలు కరుస్తున్నాయని.. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. ఈ మేరకు హైదరాబాద్ నగర ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని చెప్పారు. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చూడాలని పేర్కొన్నారు

Related posts