సాధారణంగా నగరాలలో ఇల్లు కట్టడమంటే తల ప్రాణం తోకకొస్తుంది. అనుమతుల దశ నుంచే సమస్యలు స్వాగతం పలుకుతాయి. అందులోనూ మధ్యతరగతి ప్రజలు, నిరక్షరాస్యుల ఇబ్బందుల గురించి చెప్పనక్కర్లేదు. ఈ కష్టాలను తీర్చేందుకు జీహెచ్‌ఎంసీ నూతన ప్రణాళిక సిద్ధం చేసింది. 600 చ.గ విస్తీర్ణంలోపు నిర్మించే ఇళ్లకు ఉచిత నమూనా (బిల్డింగ్ ప్లాన్ జీ ప్లస్ 2 వరకు) ఇవ్వనుంది. భూ విస్తీర్ణం, స్వరూపం ఆధారంగా పౌరులు రకరకాల నమూనాలను ఆన్‌లైన్‌లో చూసి నచ్చిన దానిని ఎంపిక చేసుకునే సౌకర్యాన్ని మరో వారంలో అందుబాటులోకి తెస్తోంది. ఈ అంశంపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 23న బల్దియా ప్రధాన కార్యాలయంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరించారు.
ఈ సమావేశం ద్వారా పౌరులు, ఇంటి అనుమతులను పొందడంలో దళారీలను సంప్రదించాల్సిందేనా? చిన్నచిన్న ఇళ్లను నిర్మించేందుకూ ఆర్కిటెక్ట్‌లు ధ్రువీకరించిన ప్లాన్ అవసరమా? ఆన్‌లైన్ దరఖాస్తుతో సమర్పించాల్సిన పత్రాలేవి? అవి అందించినప్పటికీ అధికారులు దరఖాస్తులను తిరస్కరిస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి? త్వరలో అందుబాటులోకి రానున్న ఉచిత ఇంటి నమూనాలను ఎలా చూడాలి? ఇలాంటి అనేక సందేహాలకు బల్దియా శనివారం ఏర్పాటు చేయనున్న సదస్సులో సమాధానం లభిస్తుంది.
భవన నిర్మాణ అనుమతుల జారీని రెండేళ్ల క్రితం ఆన్‌లైన్ బాట పట్టించారు. దానితో అనుమతుల సంఖ్య, వాటి ద్వారా వచ్చే రుసుం అమాంతం పెరిగాయి. వేర్వేరు రకాలకు సంబంధించి ఏటా 16వేల దరఖాస్తులు అందుతున్నాయని, వీటిలో 13వేలు వ్యక్తిగత గృహాల నిర్మాణానికి సంబంధించినవేనని అధికారులు చెబుతున్నారు. నగర పాలక సంస్థ పరిధిలోని అనుమతి పొందిన లేఅవుట్లకూ ఉచిత ఇంటి నమూనా సేవలు త్వరలో అందుబాటులోకి వస్తాయని ప్రణాళిక విభాగం తెలిపింది. ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో ఆయా లేఅవుట్లలోని ప్లాటు విస్తీర్ణం ఆధారంగా యజమానులు నచ్చిన నమూనాను ఎంచుకోవచ్చన్నారు. అందుకు సంబంధించిన కసరత్తు త్వరలో కొలిక్కి వస్తుందని ముఖ్య నగర ప్రణాళికాధికారి దేవేందర్‌రెడ్డి వెల్లడించారు. ఉచిత నమూనాలు నచ్చకపోతే.. సొంత ప్లాన్‌ను పీఎంఎస్(డెవలప్‌మెంట్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసే సదుపాయం దరఖాస్తుదారుకు ఉంటుందని స్పష్టం చేశారు.
చాలా మందికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి అవగాహన లేకపోవడంతో పది శాతం వరకు తిరస్కరణకు గురవుతున్నాయి. ఈ సమస్యను నివారించేందుకు దేశంలోనే మొదటిసారి ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నాం. పౌరుల సందేహాలను తొలగిస్తాం. ఉచిత ఇంటి నమూనా సేవలపైనా అనుమానాలను తొలగిస్తాం.
సదస్సు తేదీ: శనివారం 23వ తేదీ 
సమయం: ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 
స్థలం: బల్దియా ప్రధాన కార్యాలయం 
ఎవరెవరు హాజరు కావొచ్చంటే..: 600 చదరపు గజాల్లోపు ఇల్లు కట్టుకునేవారు, రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలోపు ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసేవారు 
వివరాలకు… 040-23220438, 7993360230


