telugu navyamedia
సినిమా వార్తలు

“మహానాయకుడు” మా వ్యూ

NTR-Mahanayakudu

బ్యానర్ : ఎన్ బికే ఫిలిమ్స్
నటీనటులు : బాలకృష్ణ, విద్యాబాలన్, రానా తదితరులు
దర్శకుడు : ఎంఎం కీరవాణి
నిర్మాతలు : కొర్రపాటి రంగనాథ సాయి, బాలకృష్ణ
సినిమాటోగ్రఫీ : జ్ఞాన శేఖర్ వి.ఎస్
ఎడిటింగ్ : అర్రం రామకృష్ణ

వెండితెర ఇలవేల్పుగా తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకొన్న గొప్ప సినీ, రాజకీయ నాయకుడు దివంగత నందమూరి తారకరామారావు. ఆ మహనీయుడి జీవితం ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కింది. తొలిభాగమైన “ఎన్టీఆర్ కథానాయకుడు” జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాగా, రెండవ భాగమైన “ఎన్టీఆర్ మహానాయకుడు” ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ హైప్ తో వచ్చిన “కథానాయకుడు” చిత్రబృందాన్ని, ప్రేక్షకులను నిరాశపరిచింది. మరి ఎలాంటి హైప్ లేకుండా ఈరోజు థియేటర్లలోకి వచ్చిన “మహానాయకుడు” ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుందో చూద్దాం.

కథ :
టైటిల్స్ లో ఎన్టీఆర్ పుట్టిన నాటి నుంచి, సినిమాల్లో స్టార్ డమ్ రావటం దాకా తర్వాత రాజకీయ ప్రకటన దాకా చూపిస్తారు. ఇక్కడ బాలయ్య మనవడు నారా దేవాన్ష్ చిన్నప్పటి ఎన్టీఆర్ పాత్రలో స్పెషల్ అప్పీరియన్స్ ఇవ్వడం విశేషం. తన పార్టీకి సంబంధించిన చిహ్నాన్ని రూపొందించిన ఎన్టీఆర్ (బాలకృష్ణ) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ప్రచారం మొదలెడతారు. అఖండ మెజార్టీతో పార్టీ ప్ర‌క‌ట‌న చేసిన 9 నెల‌లోపే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు ఎన్టీఆర్. తరువాత కిలో రెండు రూపాయిల బియ్యం, మహిళలకు ఆస్థి హక్కు వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తారు. మరోవైపు తన భార్య అనారోగ్యం ఆయన్ను కలవర పరుస్తుంది. భాధ్యతగల భర్తగా, తను బలంగా నమ్మిన సిద్ధాంతాలకు కార్యరూపం ఇస్తూ ముఖ్యమంత్రిగా బిజీ అయిపోతారు ఎన్టీఆర్. అయితే అదే సమయంలో భార్య బసవతారకం (విద్యాబాలన్) కాన్సర్ బారిన పడడం, గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడడం ఎన్టీఆర్ కు తెలుస్తుంది. దాంతో ఆమెకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించడం కోసం భార్యతో సహా అమెరికాకు వెళతారు. తిరిగి వచ్చేసరికి వెన్నుపోటుకు తను గురి అయ్యారని తెలుసుకుంటారు ఎన్టీఆర్. అనూహ్య పరిణామాల మధ్య ఎన్టీఆర్‌ బాగా నమ్మిన నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడుస్తారు. ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి దూరం చేస్తారు. ఎన్టీఆర్ తిరిగి ఢిల్లీలో పోరాడి రాష్ట్రపతిని కలిసి తిరిగి రెండోసారి సీఎం‌గా ప్రమాణ స్వీకారం చేయడం వెనక జరిగిన పరిణామాలేంటి ? నాదెండ్ల భాస్కరరావు చేసిన నమ్మక ద్రోహం ఏమిటి ? ఆ సమయంలో చంద్రబాబు పాత్ర, ఆయన ప్రదర్శించిన తెలివితేటలు ఏమిటి ? అప్పట్లో కాంగ్రేస్ నిరంకుశ‌ పాలనకి ఎన్టీఆర్ ఎలా చెక్ పెట్టారు అనే విషయాలు వెండి తెరపై వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :
ఈ సిననిమాకు బాలయ్య హైలెట్. తన వయస్సుకి తగ్గ పాత్ర కావటంతో బాలయ్య తన రెగ్యులర్ ఎమోషన్స్ ని, ఎక్సప్రెషన్స్ ని చూపించకుండా తన తండ్రిని ఆవాహన చేసుకునే ప్రయత్నం చేశారు. ఆగ్రహావేశాలను, ఎమోషన్స్ ను సమర్థవంతంగా పలికించారు బాలకృష్ణ. అసెంబ్లీలో ఎన్టీఆర్‌ను అవమానపరిచే సన్నివేశాలకు బాలకృష్ణ తన నటనతో ప్రాణం పోశారని చెప్పొచ్చు. ఇక తరువాత చెప్పుకోవాల్సింది రానా గురించి. రానా చంద్రబాబు పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడా అన్పిస్తుంది. తెలుగుదేశం ఎమ్మెల్యేలను ఢిల్లీ తరలిస్తున్నప్పుడు..మధ్యలో వచ్చే సమస్యలను, అక్కడ తగిలే విలన్‌‌లతో చంద్రబాబు ఫైటింగ్‌కి దిగటం వంటివి సన్నివేశాలకు జీవం పోసి చంద్రబాబు హీరోయిజాన్ని ఎలివేట్ చేశారు రానా. ఇక మిగతా నటీనటులు తమ పరిధిమేరకు నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు :
దర్శకుడు క్రిష్ పాత్రల ద్వారా కథనాన్ని ముందుకు నడిపిస్తూ ఏది ఎంత మేరకు చెప్పాలో అంతే చెప్పాడు. ముఖ్యంగా అధికారంలోకి రాగానే ఎన్టీఆర్‌కి ఏర్పడిన అవరోధాలు, ప్ర‌భుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వ‌య‌సుని త‌గ్గించ‌డం వల్ల ఆయ‌న ఎదుర్కొన్న విమర్శలు, మళ్ళీ ఆ నిర్ణ‌యం వెనక్కి తీసుకోవడానికి గల అసలు కారణం వంటి విషయాలను ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఎన్టీఆర్ ని రెచ్చగొట్టి లబ్ధి పొందేందుకు అసెంబ్లీలో వైరి పక్షం పన్నిన వ్యూహం, పాత బస్తీ అల్లర్లపై చర్చ, మహిళా ఎమ్మెల్యేలు గాజులు పగులగొట్టడం వంటి సన్నివేశాలను అద్భుతంగా చూపించారు. అయితే తమకు ఎక్కడదాకా కావాలో అక్కడ దాకా చెప్పేసి అర్దాంతరంగా ఆపేసిన ఫీలింగ్ వచ్చింది. ఆఖర్లో ఏ జరిగిందో అసలు చెప్పనేలేదు. దీంతో ప్రేక్షకులకు కాస్త నిరాశ ఎదురవుతుంది. ఇక ఎన్‌బీకే బ్యానర్‌లో బాలయ్య ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు. జ్ఞాన శిఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. కెమెరా పనితనం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణంగా నిలిచింది. ఎడిటింగ్ ఇంకాస్త బాగుండాల్సింది.

Related posts