అమెరికాలో ఉండే ఇండియన్స్‌కు శుభవార్త చెప్పింది బిడెన్ ప్రభుత్వం. తమ దేశానికి వలస వచ్చిన వారికి పౌరసత్వాన్ని ఇచ్చే రెండు కీలకమైన బిల్లులకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదముద్ర వేసింది. సరైన పత్రాలు లేకుండా అమెరికాకు వలస వచ్చిన వారికి, వారి పిల్లలకు, వ్యవసాయ కార్మికులకు, హెచ్1బీ వీసా ద్వారా అమెరికాకు వచ్చిన టెక్ నిపుణుల పిల్లలకు అమెరికా పౌరసత్వాన్ని అందించడమే ఈ రెండు బిల్లుల ముఖ్యోద్దేశం. 228-197 ఓట్ల మెజార్టీతో ఈ బిల్లులు ప్రతినిధుల సభలో గురువారం ఆమోదం పొందాయి. దేశ వలస విధానంలో విప్లవాత్మక మార్పులను తెచ్చే దిశగా ఇది అత్యంత కీలక ఘట్టమని ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. సరైన పత్రాలు లేకుండా అమెరికాకు వలస వచ్చిన వారి పిల్లలను డ్రీమర్స్‌గా పిలుస్తారు. తాజా బిల్లుల ఆమోదంతో వీరికి చట్టబద్ధమైన నివాస హోదా లభించనున్నది.