telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బీజేపీ గూటికి మాజీ మంత్రి తుమ్మల…? అసలు విషయమేమిటంటే

సీనియర్‌ రాజకీయనేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారుతున్నారనే ప్రచారం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.. గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పి తుమ్మల.. బీజేపీ కండువా కప్పుకుంటారనే ప్రచారం సాగింది. అయితే, అదంతా ఫేక్‌ న్యూస్‌గా తేలిపోయింది… విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఆయనకు అత్యంత సన్నిహితులు చెబుతున్న ప్రకారం అలాంటి ఆలోచన ఏదీ తుమ్మల మదిలో లేదని స్పష్టమవుతోంది.. గత ఎన్నికల్లో ఆయన ఓటమిపాలై మంత్రి పదవి కోల్పోయినా.. ఏ ఎన్నికలు వచ్చినా.. ఆయన ముందుండి టీఆర్ఎస్‌ పార్టీని నడిపించారని చెబుతున్నారు. తాజాగా, జరిగిన రైతు వేదిక ప్రారంభోత్సవంలోనూ పాల్గొన్నారు తుమ్మల.. ఇక, తుమ్మల బర్త్‌డే వేడులకు టీఆర్ఎస్‌ శ్రేణులు, ఆయన అభిమానులు భారీ ఎత్తున నిర్వహించిన సంగతి కూడా తెలిసిందే.. రాజకీయాల్లో గెలుపు, ఓటములు ఎలా ఉన్నా… సీఎం కేసీఆర్‌కు తుమ్మల అత్యంత సన్నిహితుడిగా చెబుతుంటారు… ఈ నేపథ్యంలో.. ఏ విధంగా చూసినా తుమ్మల గులాబీ పార్టీని వీడరని… బీజేపీలో ఎలాంటి పరిస్థితుల్లో చేరబోరని చెబుతున్నారు.

కాగా, దివంగత ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో మంత్రిగా ఓ వెలుగు వెలిగిన తుమ్మల… 2014 ఎన్నికల్లో ఓటమిపాలైనా గులాబీ పార్టీలో చేరి మంత్రి పదవి దక్కించుకున్నాడు. ఖమ్మంలో తిరుగునేతగా మారాడు.. గులాబీ పార్టీకి పట్టులేని ఖమ్మం జిల్లాలో పార్టీని బలోపేతంపై ఎంతో కష్టపడ్డారు. నాలుగేళ్ల కాలంలో టీఆర్ఎస్‌లోనూ బలమైన నేతగా ఎదిగారు.. ఖమ్మం జిల్లా రాజకీయాలను శాసించారు. అయితే, పార్టీలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలతో 2018 ఎన్నికల్లో మరోసారి తుమ్మల ఓటమిపాలయ్యారు.. దీంతో.. టీఆర్ఎస్‌ 2 సర్కార్‌లో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు.. అయినా ఆయన గులాబీ పార్టీలోనే కొనసాగుతూ.. పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టారు.. అయితే, దుబ్బాకలో టీఆర్ఎస్‌ ఓటమి తర్వాత.. పలువురు టీఆర్ఎస్‌ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం సాగుతోన్న సమయంలో.. తుమ్మల పేరు తెరపైకి వచ్చింది. కానీ, టీఆర్ఎస్‌ పార్టీ, సీఎం కేసీఆర్‌తో ఆయనకు ఉన్న అనుబంధం ప్రకారం.. ఎట్టి పరిస్థితుల్లో తుమ్మల పార్టీ మారబోరని బల్లగుద్ది చెబుతున్నారు ఆయన అనుచరులు.

Related posts