telugu navyamedia
క్రైమ్ వార్తలు

పశ్చిమ బెంగాల్‌లో ఘోర రైలు ప్ర‌మాదం

పశ్చిమ బెంగాల్‌లో ఘోర రైలు ప్ర‌మాదం చోటుచేసుకుంది. జల్‌పైగురి జిల్లాలో గురువారం బికనీర్-గౌహతి ఎక్స్‌ప్రెస్ (15633) 12 కోచ్‌లు పట్టాలు తప్పడంతో ఎనిమిది మంది మృతి చెంద‌గా.. మరో 45 మందికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు.

రాజస్థాన్‌లోని బికనీర్‌ నుంచి బయలుదేరిన రైలు బీహార్‌లోని పాట్నా మీదుగా అస్సాంలోని గౌహతికి వెళ్తుండగా గురువారం సాయంత్రం 5.15 గంటల ప్రాంతంలో జల్‌పైగురిలోని మేనాగురి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బికనీర్ నుండి రైలు ఎక్కిన 177 మంది మరియు పాట్నా జంక్షన్ నుండి రైలు ఎక్కిన 98 మంది ప్రయాణికులతో సహా మొత్తం 1,200 మంది ప్రయాణికులు ఉన్నారు.

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, తాను స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నానని, సహాయ చర్యల గురించి ప్రధాని నరేంద్ర మోడీకి వివరించానని చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, తీవ్రగాయాలైన వారికి రూ.లక్ష, సాధారణ గాయాలపాలైన వారికి రూ.25,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

ఈ ప్ర‌మాదంలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాన‌ని అన్నారు. త‌మ ప్రాథమిక విచారణలో లోకోమోటివ్ పరికరాలలో లోపం ఉందని గుర్తించామ‌ని చెప్పారు. అయితే ప్రమాదానికి గ‌ల అస‌లైన కార‌ణాన్ని తెలుసుకోవ‌డానికి రైల్ సేఫ్టీ కమిషన్  విచార‌ణ నిర్వ‌హిస్తోంద‌ని మంత్రి అన్నారు. 

Related posts