telugu navyamedia
సినిమా వార్తలు

52 సంవత్సరాల “శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం”

నటరత్న ఎన్.టి.రామారావు గారు నటించిన పౌరాణిక చిత్రం పూర్ణిమ పిక్చర్స్ వారి “శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం” 18-05-1972 విడుదలయ్యింది.

తాండ్ర సుబ్రహ్మణ్యం రచించిన “శ్రీకృష్ణాంజనేయ యుధ్ధం” నాటకం ఆధారంగా నిర్మాత డి.యన్.రాజు గారు పూర్ణిమ పిక్చర్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు సి.యస్.రావు గారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రానికి కధ: తాండ్ర సుబ్రహ్మణ్యం, మాటలు: సముద్రాల రామానుజాచార్య(జూనియర్) పాటలు: సి.నారాయణరెడ్డి,సముద్రాల, తాండ్ర సుబ్రహ్మణ్యం, దాశరథి, సంగీతం: టి.వి.రాజు

సినిమాటోగ్రఫీ: జి.కె.రాము, కళ: మాధవపెద్ది గోఖలే, నృత్యం: వెంపటి సత్యం, ఎడిటింగ్: గోవింద దినకర్ జోషి, రామస్వామి, అందించారు.

ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు, దేవిక, వాణిశ్రీ, రాజనాల, యస్.వి. రంగారావు, కాంతారావు, నాగయ్య, రాజబాబు, శాంతకుమారి, ఆర్జా జనార్ధనరావు, హేమలత, ముక్కామల, వై.విజయ, ధూళిపాళ, మిక్కిలినేని, లీలారాణి, సంధ్యారాణి, విజయభాను, ఝాన్సీ, రోజారమణి, శ్రీదేవి తదితరులు నటించారు.

ప్రఖ్యాత సంగీత దర్శకుడు టి.వి.రాజు గారు స్వరపరచిన బాణీలు ప్రేక్షకులను సమ్మోహన పరిచాయి.
“రామా,రఘురామా ఎన్నాళ్ళు వేచేను ఓ రామా! నీకు ఇకనైన దయరాదా శ్రీరామా!”
“నీవైన చెప్పవే ఓ మురళీ,ఇక నీవైన చెప్పవే ప్రియ మురళీ”
“గోపాలకృష్ణయ్య రావయ్య మా జేజేలు అందుకోవయ్య”
“చక్కాని గోపాలకృష్ణుడమ్మా,ముద్దుకృష్ణుడమ్మా”
“రామ రామ రామ సీతారామ రఘురామ, దశరథ నందన”
వంటి పాటలు, పద్యాలు శ్రోతలను ఆకట్టుకున్నాయి.

ఈ చిత్రం లో ఎన్.టి.రామారావు గారు శ్రీరాముడు గాను, శ్రీకృష్ణుడు గాను నటించారు. రామావతారం ముగింపుతో చిత్రం ప్రారంభమై శ్రీకృష్ణతత్వం తో ముగుస్తుంది.

రామభక్త హునుమాన్ అటు త్రేతాయుగంలోను, ఇటు ద్వాపరయుగంలోను చిరంజీవి గా జీవిస్తూ రాముడైన, కృష్ణుడైన దేవుడు ఒక్కరే అన్న పరమార్ధాన్ని లోకానికి తెలియచేయటమే ఈచిత్రం పరమార్ధం.

ఈ చిత్రం లో మరొక విశేషం ఎప్పుడు విలన్ పాత్రలు ఎక్కువుగా ధరించే రాజనాల గారు అంజనేయుడుగా ఆ పాత్రను ఆమోఘం గా పోషించి ప్రేక్షకులచేత ప్రశంసలు పొందారు..

ఎన్టీఆర్ గారు అప్పటివరకు ఏడాదికి 10 సినిమాలకు పైగా నటిస్తున్న రోజులలో 1972 లో మాత్రం కేవలం మూడు సినిమాల్లో మాత్రమే నటించారు.

ఆ ఏడాది శ్రీకృష్ణాoజనేయయుద్దం, కులగౌరవం, బడిపంతులు చిత్రాలు మాత్రమే విడుదల అయ్యాయి.

ఈ చిత్రం ఘన విజయం సాధించి 20 కేంద్రాలలో 50 రోజులు ప్రదర్శింపబడి విజయవాడ తో పాటు, మరికొన్ని కేంద్రాల్లో షిఫ్ట్ పై 100 రోజులు ఆడి, శతదినోత్సవాలు జరుపుకున్నది .

విజయవాడ — జైహింద్ టాకీస్ లో 72 రోజులు + దుర్గామహల్ (షిఫ్ట్) తో 100 రోజులు ఆడింది…

Related posts