రజనీకాంత్ ఓ స్టార్ హీరో. ఒక్క తమిళనాడులోనే కాకుండా.. దేశమంతా ఆయనకో ఇమేజ్ ఉంది. ఆయన సినిమాలకు బ్రాండ్ రజనీనే. ఆయన స్టయిలే ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. ఎంజీఆర్, జయలలితల తర్వాత తమిళనాడులో వెండితెరను ఓ ఊపు ఊపిన రజనీకాంత్.. రాజకీయ తెరపైనా హిట్ కొడదామని ఆశించారు. సొంతంగా పార్టీ పెట్టి వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని లెక్కలు వేసుకున్నారు. దాదాపు నాలుగేళ్లుగా కసరత్తు చేస్తున్న ఆయన.. ఈ నెల 31న అధికారికంగా పార్టీ పేరు ప్రకటిస్తానని చెప్పారు కూడా. అయితే.. కొన్ని అనివార్య కారణాల వల్ల రాజకీయాలకు చెక్ పెట్టారు. ఇది ఇలా ఉండగా…. తాజాగా రజనీకాంత్ మరో అరుదైన ఘనత సాధించారు. సినీ రంగంలో అత్యున్నత పురష్కారంగా భావించే దాదా సాహెచ్ ఫాల్కే అవార్డును 2021కి గాను రజనీకాంత్ అందుకోనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ కొద్ది సేపటి కిందటే ప్రకటించారు. 51వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ సూపర్ స్టార్ రజనీకాంత్ అందుకోనున్నట్లు ఆయన తెలిపారు. 1969 లో ప్రారంభమైన ఈ అవార్డుల ప్రధానోత్సవంలో ఇప్పటి వరకు 50 మంది ఈ అత్యున్నత అవార్డు అందుకున్నారు.