కొత్తగా న్యాయవాద విద్యను పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో స్థిరపడే వరకు.. అనగా మూడేళ్ల పాటు నెలకు 5000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలతో కూడిన జీవోకు ఆయన ఆమోదం తెలిపారు. ఈ జీవోను ఈ నెల 14వ తేదీన ప్రభుత్వం జారీ చేయనుంది. అర్హులైన జూనియర్ లాయర్లకు నవంబర్ 2న నిర్దేశించిన బ్యాంకు ఖాతాల్లో ఆ మేరకు నగదు జమ చేయనున్నారు. నవంబర్ 3వ తేదీన లబ్ధిదారులకు నగదు జమకు సంబంధించిన రశీదులతో పాటు సీఎం జగన్ సందేశాన్ని గ్రామ వలంటీర్లు డోర్ డెలివరీ చేయనున్నారు. దరఖాస్తులను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గ్రామ, వార్డు వలంటీర్లకు పంపిస్తారు.
తనిఖీల అనంతరం అర్హులైన దరఖాస్తుదారుల వివరాలను పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు, గ్రామాల్లో ఎంపీడీవోలకు పంపుతారు. వారు పరిశీలించాక జిల్లా కలెక్టర్ల ఆమోదానికి పంపుతారు. అర్హులైన వారి వివరాలను సీఎఫ్‌ఎంఎస్ వెబ్‌సైట్‌లో ఉంచుతారు. అర్హులైన జాబితాలను సామాజిక తనిఖీ నిమిత్తం గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆంధ్రప్రదేశ్ యువ లాయర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ, లోటు బడ్జెట్ రాష్ట్రంలో ఇటీవల నగదు పంపిణి పధకాలు ఏరులై పారుతుండటమే విచిత్రంగా ఉంది. ఒక్కో డిపార్ట్మెంట్ కి చెందిన వారికి ఈ విధంగా నగదు పంపిణి చేసేస్తుండటం కాస్త అతిగానే ఉంది. లక్షల కోట్లు ఇలా నగదు సాయం కంటే స్థిరమైన రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం అంటున్నారు విశ్లేషకులు.

