చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించడంతో పాటు, దానికి అదనంగా ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు ఇస్తామని రాహుల్ చెప్పారు. ఆయన తమిళనాడులో యూపీఏ తరఫున ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. చెన్నైలోని స్టెల్లా మేరీ కళాశాలలో విద్యార్థినులతో జరిగిన ముఖాముఖిలోనూ, విలేకరుల సమావేశంలోనూ మాట్లాడారు.నాయకత్వ స్థానాల్లో తగినంత మంది మహిళలు లేరని, అందుకే రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఇది ప్రారంభం మాత్రమేనని అన్నారు.
పేదలకు కనీస ఆదాయ హామీ పథకాన్ని అమలు చేస్తామన్న వాగ్దానాన్ని పునరుద్ఘాటించారు. మరింత సరళంగా ఉండేలా జీఎస్టీలో సంస్కరణలు తీసుకొస్తామంటూ మరో హామీ ఇచ్చారు. బెదిరించడం ద్వారా రాష్ట్రాలపై ఆధిపత్యం చలాయించవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. ప్రస్తుత అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి కార్యాలయం శాసిస్తోందని, గతంలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదని అన్నారు. తమిళభాషను, సంస్కృతిని నాశనం చేస్తున్నారని, దీనిని కొనసాగనీయబోమని అన్నారు. అబద్ధాలు చెబుతున్న మోదీని ఓడించి సత్యం వైపు నిలవాలని తమిళ ప్రజలను కోరారు.