కేవలం గత సంవత్సరంలోనే ప్రపంచవ్యాప్తంగా 164 మంది భూ, పర్యావరణ పరిరక్షణ కార్యకర్తలు హత్యకు గురయ్యారని తాజా నివేదికలో వెల్లడైంది. మైనింగ్ వంటి సంస్థల నుంచి భూములు, ప్రకృతి వనరులు దోపిడీకి గురికాకుండా కాపాడుకునే క్రమంలో వారు అక్రమణదారుల చేతుల్లో మృతిచెందారని గ్లోబల్ విట్‌నెస్ అనే సంస్థ మంగళవారం పేర్కొంది. దీంతో పాటు హింస, బెదిరింపులు, నిరసన వ్యతిరేక చట్టాలను దుర్వినియోగం చేయడం ద్వారా వేలాది మంది గొంతుకలను మాఫియా, వారికి అండగా ఉండే ప్రభుత్వాలు నొక్కివేశాయని ఈ నివేదిక తెలిపింది. ఉద్యమకారులకు ఫిలిఫ్పైన్స్ ప్రమాదకర దేశమని ఉందని, అక్కడ సంవత్సర కాలంలో 30 హత్యలు జరిగాయని వెల్లడించింది.
భారత్, కొలంబియాల్లో ఈ సంఖ్య 23, 24 చొప్పున ఉంది. జనాభా సరాసరిన చూసుకుంటే 16 హత్యలతో గ్వాటెమాల అత్యంత ప్రమాదకరంగా ఉంది. ఈ గణాంకాలను చూస్తుంటే భూహక్కులు, పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడేవారిని, ఉద్యమించే వారిని ఈ ప్రపంచం ఉగ్రవాదులుగా, నేరస్తులుగా చూస్తోందని విక్కీ తౌలీ అనే కార్యకర్త అభిప్రాయపడ్డారు. హక్కులను కాలరాసే ఇటువంటి హింసాత్మక ధోరణులు ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని నివేదిక తెలిపింది. గతేడాది తమిళనాడులో కాపర్ మైనింగ్‌కు వ్యతిరేకంగా పోరాడిన 13 మంది హత్యకు గురైన సంగతి తెలిసిందే.