telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

పండగలకు ప్రత్యేక రైళ్లు అంటూ.. బాదేస్తున్నారా..

special train between vijayawada to gudur

క్రిస్మస్, జనవరి ఫస్ట్, సంక్రాంతి సందర్భంగా… పెరగబోయే రద్దీని దృష్టిలో పెట్టుకొని… దక్షిణ మధ్య రైల్వే 65 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. కాచిగూడ – శ్రీకాకుళం, తిరుపతి, సికింద్రాబాద్, గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. కాచిగూడ – శ్రీకాకుళం (07016), శ్రీకాకుళం- తిరుపతి (07479), తిరుపతి- కాచిగూడ (07146), విజయవాడ రాయనపాడు మీదుగా శ్రీకాకుళంకు ప్రత్యేక రైళ్లు వెళ్తాయి. కాచిగూడ- శ్రీకాకులం మధ్య సువిధ ప్రత్యేక రైలును నడపనున్నారు. ఇది గుడ్ న్యూస్ అనుకునేలోపు… షాకింగ్ న్యూస్ కూడా చెప్పింది. ఏంటంటే… ప్రస్తుతం అన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్టే ఉంది. అందువల్ల ప్రత్యేక రైళ్లలో వెళ్దామనుకునేవాళ్లకు షాక్ ఇస్తోంది రైల్వే శాఖ. సువిధ పేరుతో వెళ్లే ప్రత్యేక రైళ్లలో ఛార్జీల బాదుడే బాదుడు. సికింద్రాబాద్‌ నుంచి కాకినాడకు స్లీపర్‌ టికెట్‌ ఛార్జీ రూ.345. సువిధ రైళ్లలో అది ఏకంగా రూ.1,185. అంటే దాదాపు 243 శాతం అధికం. ఈ విషయం తెలియగానే… ప్రయాణికుల గుండెల్లో సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు పరిగెడుతున్నాయి.

సొంతూళ్లకు వెళ్లే లక్షల మందిని టార్గెట్ చేస్తూ… అడ్డగోలు దోపిడీకి రైల్వే అధికారులు కూడా తెరతీశారని అనుకోవచ్చు. కాచిగూడ, సికింద్రాబాద్‌ స్టేషన్ల నుంచి ఏపీలోని కాకినాడ, నర్సాపూర్‌, మచిలీపట్నానికి నాలుగు సువిధ రైళ్లు ప్రకటించారు. రద్దీని బట్టి మరికొన్నింటిని పెంచే అవకాశం ఉంది. పండగల సమయంలో సువిధ రైళ్ల పేరుతో ప్రయాణికులపై అదనపు ఛార్జీల భారం వేయవద్దని రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ గతేడాది సంక్రాంతికి ముందే ఆర్డరేశారు. అయినా మన రైల్వే అధికారులు రూట్ మార్చేశారు. మరో షాకింగ్ విషయమేంటంటే… ఇంత రేటు పెట్టి టికెట్లు కొనుక్కున్నా… టికెట్ దక్కుతుందన్న గ్యారెంటీ లేదు. అక్కడ కూడా వెయిటింగ్ లిస్టే కనిపిస్తోంది. చివరకు RACలో సీట్లు ఇస్తూ… ప్రయాణికుల్ని అన్ని రకాలుగా ముంచేస్తున్నారన్న విమర్శలొస్తున్నాయి. రైల్వేలను చూసి… ఆర్టీసీ కూడా అదే రూట్ ఫాలో అయితే ఆశ్చర్యం అక్కర్లేదు. అంటే ఈసారి పండక్కు ఊరెళ్లాలనుకుంటే… అటు రైల్వే, ఇటు ఆర్టీసీ వీర బాదుడు తప్పనిసరి!

Related posts