telugu navyamedia
వ్యాపార వార్తలు

ఆర్​బీఐ కీలక నిర్ణయం.. మళ్లీ వడ్డీ రేట్లు పెంపు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మళ్లీ షాక్ ఇచ్చింది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది.  రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. దీంతో ప్రస్తుతం రెపో రేటు 4.4 నుంచి 4.9 శాతానికి పెరిగింది. పెంచిన వడ్డీరేట్లు తక్షణం అమల్లోకి వస్తాయని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.

ద్రవ్యోల్బణం తగ్గించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు రిజర్వు బ్యాంకు గవర్నర్ తెలిపారు. ఏప్రిల్‌, మే నెలల్లో ద్రవ్యోల్బణం స్థిరంగా ఉందని చెప్పారు. జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతంగా అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

మే 4న ఆర్‌బీఐ రెపో రేట్ 40 బేసిస్ పాయింట్స్ పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో 50 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేట్లు పెంచింది. దీంతో నెల రోజుల్లోనే వడ్డీ రేట్లు 90 పైసలు పెరిగాయి.

రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచడంతో హోమ్ లోన్, పర్సనల్ లోన్ ఈఎమ్ఐలు భారీగా  పెరుగుతాయి. కొత్తగా రుణాలు తీసుకునేవారికీ ఎక్కువ వడ్డీ రేటు వర్తిస్తుంది. దీంతో కస్టమర్లకు ఈఎంఐ భారం అవుతుంది.

ముఖ్యంగా హోమ్ లోన్లు ఆర్‌బీఐ రెపో రేట్‌కు లింక్ అయి ఉంటాయి కాబట్టి హోమ్ లోన్ భారం కానుంది. ఆ ప్రభావం రియల్ ఎస్టేట్ సెక్టార్ పైన ఉంటుంది. హోమ్ లోన్ తీసుకునేవారిలో రెపో రేట్ లింక్డ్ లెండింగ్ రేట్ ఎంచుకుంటూ ఉంటారు. రెపో రేట్ తగ్గితే ఈ వడ్డీ తగ్గుతుంది. రెపో రేట్ పెరిగితే ఈ వడ్డీ పెరుగుతుంది.

ఉదాహరణకు హోమ్ లోన్ రూ.50 లక్షలు తీసుకుంటే 20 ఏళ్లలో మరో రూ.7 లక్షలు అదనపు వడ్డీ పడనుంది. పర్సనల్ లోన్‌పై 12 శాతానికి వడ్డీ పెరిగే అవకాశం ఉంది. కారు లోన్‌పై 9.5 శాతానికి వడ్డీ పెరిగే ఛాన్స్  ఉంది

Related posts