telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

కూరగాయలను సబ్బుతో కడగొచ్చా ?

vegetables

కరోనా వైరస్ నేపథ్యంలో కొందరు కూరగాయాలను సైతం సబ్బు, సర్ఫులతో శుభ్రం చేస్తున్నారు. అలా చేయడం సరైన విధానమేనా? కూరగాయలను, పండ్లను డిటర్జెంట్లతో కడగాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. అలాగే కరోనా వైరస్ ఆహారం ద్వారా వ్యాప్తి చెందుతుందని చెప్పేందుకు తగిన ఆధారాలు కూడా లేవు. మీ ఆహారంలో ఉండే సూక్ష్మ జీవులు, బ్యాక్టీరియా తొలగిపోవాలంటే కూరగాయలను వాడే ముందు ఈ ఐదు చిట్కాలు పాటించండి.

1. కూరగాయలను లేదా కాయగూరలు, పండ్లను కడిగే ముందు తప్పకుండా చేతులను శుభ్రం చేసుకోవాలి. వాటిని పైపు కింద పెట్టి సుమారు 20 సెకన్లపాటు కడిగి పక్కన పెట్టుకోవాలి. వాటిని వండటానికి ముందు మరోసారి క్లీన్ చేయడం చాలా మంచిదని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.

2. కూరగాయలు, పండ్లను సబ్బు, డిటర్జెంట్లు, ఇతరాత్ర క్లీనింగ్ వస్తువులతో శుభ్రం చేయాలనేది కేవలం అపోహ మాత్రమేనని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) వెల్లడించింది. కుళాయిలో నీరు మరీ ఫోర్సుగా కాకుండా నెమ్మదిగా వదలాలి. దాని కింద కూరగాయలు లేదా పండ్లు పెట్టి సున్నితంగా కడగాలి. కూరగాయలు, పండ్లలో ఏమైనా పగుళ్లు ఉన్నట్లయితే ఆ భాగాన్ని తొలగించి వండుకోవాలి.

3. క్యారెట్, బంగాళదుంప, చిలకడ దుంప, అల్లం, ముల్లంగి వంటి వేర్లు తరహా కూరగాయలను బ్రష్ లేదా స్పాంజ్‌లను వాడండి. దీనివల్ల వాటికి అంటుకుని ఉండే.. మట్టి, బ్యాక్టీరియా తొలగిపోతుంది. చాలామంది దుంపలకు మట్టి అంటుకుని ఉంటుందనే కారణంతో తొక్కను తొలగిస్తారు. దీనివల్ల వాటిలో ఉండే పోషకాలు బయటకు పోతాయి.

4. చాలామంది కూరగాయలన్నీ ఒకే పాత్రలో వేసి నీటితో శుభ్రం చేస్తున్నారు. దీనివల్ల క్రిములు అంత త్వరగా బయటకు పోవు. మార్కెట్ నుంచి కూరగాయలను తెచ్చిన వెంటనే పైపు కింద పెట్టి.. ఫ్లోలో కడగాలి. దీనివల్ల ఆ కూరగాయలకు పట్టుకుని ఉండే దుమ్ము, బ్యాక్టీరియా వాటిలో ఉండిపోకుండా బయటకు వెళ్లిపోతాయి.

5. ఆకు కూరలు, క్యాబేజీ, కాలిఫ్లవర్ వంటి వాటిని ప్రత్యేకంగా కడగడం మంచిది. వీలైతే ఒక పెద్ద పాత్రలో నీళ్లు, ఉప్పు కలిపి కాసేపు ఉంచి బయటకు తీసేయండి. దీనివల్ల వాటిలో ఏమైనా పురుగులు ఉంటే బయటకు వచ్చేస్తాయి. ఆ తర్వాత వాటిని శుభ్రంగా కడిగి, ఆరబెట్టి ఫ్రిజ్‌లో పెట్టండి. మార్కెట్ నుంచి నేరుగా తీసుకొచ్చే ఆకుకూరల్లో పురుగులు ఉండే అవకాశాలు ఎక్కువ. కాబట్టి.. వాటిని పై విధంగా శుభ్రం చేసిన తర్వాతే ఫ్రిజ్‌లో పెట్టండి. లేకపోతే అవి వేరే ఆహారాల్లోకి చేరే ప్రమాదం ఉంది.

Related posts