telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీ డ్వాక్రా మహిళలకు.. మరో పదివేలు+స్మార్ట్ ఫోన్.. : బాబు

ఏపీలోని ఆడపడుచులకు ప్రభుత్వం మరో వరం ప్రకటించింది. మహిళల ఆర్థిక పరిపుష్టి కోసం ఇప్పటికే పసుపు-కుంకుమ కింద భారీమొత్తంలో నగదు మొత్తాన్ని అందించిన ప్రభుత్వం, మరోసారి డ్వాక్రా సంఘాల సభ్యులకు రూ.10వేలు ఇచ్చేందుకు నిర్ణయించింది. పాత గ్రూపు సభ్యులకే కాకుండా, ఈ మధ్యకాలంలో ఏర్పడిన అన్ని సంఘాలకు, వాటిలోని సభ్యులకు కూడా ఈ నగదు మొత్తాన్ని ఇవ్వనుంది. వచ్చే నెల మొదటి వారంలో ఏకకాలంలో చెక్‌ల రూపంలో ఈ నగదును అందించి, మహిళల మోముల్లో చిరునవ్వులు పూయించనుంది. ప్రభుత్వం అందిస్తున్న ఈ భారీ కానుక వల్ల జిల్లాలో దాదాపు 6లక్షల14వేల మంది మహిళలకు మేలు కలుగుతుంది. అంతేకాకుండా ప్రతి సభ్యురాలికి రూ.4వేల విలువచేసే స్మార్ట్‌ఫోన్‌ను కూడా అందించేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది. ప్రభుత్వం ఇంత పెద్ద తరహాలో లబ్ధి చేకూర్చుతుండటంతో మహిళల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

డ్వాక్రా మహిళల ప్రగతి కోసం సీఎం చంద్రబాబు ఇప్పటికే ఒక దశ నగదును పంపిణీ చేసేశారు. పెట్టుబడి నిధి, చంద్రన్న చేయూత, పసుపు-కుంకుమ కింద నాలుగు విడతల్లో డ్వాక్రా సభ్యులకు చెల్లింపులు చేశారు. తొలి రెండు విడతలో రూ.3వేల చొప్పున జమ చేయగా, మలి రెండు విడతలో మరో రూ.2వేలను సభ్యురాలి ఖాతాలోకి జమ చేశారు. మొత్తంగా నాలుగు విడతలలో ప్రతి ఒక్క సభ్యురాలికి రూ.10వేలను వారి ఖాతాలో వేశారు. 2014, మార్చి 31 నాటికి ఉన్న గ్రూపులకు, అందులోని సభ్యులకు మాత్రమే ఎన్నికల హామీలో భాగంగా ఈ నగదును అందించారు. అప్పుడు మొత్తం 56,408 గ్రూపుల్లోని దాదాపు 5లక్షల70వేల మందికి రూ.570 కోట్ల మేర ప్రభుత్వం లబ్ధి చేకూర్చింది.

మహిళలకు రూ.10వేల కానుకతో పాటు, వారిని మరింతగా ముందుకు నడిపించేందుకు వీలుగా స్మార్ట్‌ఫోన్లను కూడా ప్రభుత్వం అందించనుంది. ప్రతి అంశంపైనా మహిళలు అవగాహన కలిగి ఉండే ఉద్దేశంతో రూ.4వేల విలువైన స్మార్ట్‌ఫోన్లను ప్రభుత్వం పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధపరుస్తోంది. జిల్లాలోని ప్రతి సభ్యురాలికీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందించి, వారి ఆనందాన్ని మరింత రెట్టింపు చేయాలని ప్రభుత్వ యోచన.

Related posts