telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

కొత్త మున్సిపల్ చట్టంతో… అంతరికి మేలు… : కేసీఆర్

kcr special pooja in kaleswaram

పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల పటిష్ట అమలు గ్రామాలు, పట్టణాల గుణాత్మక అభివృద్ధిలో కీలకమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. మున్సిపల్ చట్టాన్ని ఎంత మెరుగ్గా రూపొందించగలిగితే.. ప్రజలకు అంత గొప్ప సేవలను అందించగలుగుతామని చెప్పారు. రాష్ట్రంలో పంచాయితీరాజ్ వ్యవస్థను బలోపేతంచేసే దిశగా ప్రభుత్వం ముందుకు తెస్తున్న నూతన పంచాయతీరాజ్ చట్టం అమలుకోసం కార్యాచరణ, నూతన మున్సిపాలిటీ చట్టం రూపకల్పనపై సోమవారం ప్రగతిభవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రజలకు సుపరిపాలన అందించడానికి ప్రస్తుతమున్న చట్టాలను సవరించుకుంటూ మరింత పటిష్టంగా అమలుచేయాల్సిన అవసరం ఉన్నదన్నారు.

పంచాయతీరాజ్ చట్టాన్ని పటిష్టంగా రూపొందించిన పద్ధతిలోనే, అవినీతిరహితంగా పాలన అందేలా, ప్రజలకు మేలు జరిగేలా మున్సిపల్ చట్టం రూపకల్పన చేయాలనీ, నూతన పంచాయతీరాజ్ చట్టానికి పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలి అని ఆదేశించారు. మనం మనసుపెట్టి పనిచేస్తే గ్రామాలు మున్సిపాలిటీ స్థాయిల్లో కావాల్సినంత పని ఉన్నదని, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ విషయాన్ని గ్రహించాలని అన్నారు. ఇక్కడ పని వదిలి, ఇంకెక్కడనో ఉన్నట్టు నేల విడిచి సాము చేయవద్దని చెప్పారు. విద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పన నుంచి గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రతతోపాటు ఇతర మౌలికరంగాల అభివృద్ధిని చేపట్టాల్సిన బాధ్యత మన మీద ఉన్నదన్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ మున్సిపాలిటీలు దినదినాభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రజలకు మేలైన పాలన అందించవలసిన విషయాన్ని గమనించాలని దిశానిర్దేశం చేశారు. ఇందుకు సంబంధించిన చట్టం అమలు విషయంలో అటు ప్రభుత్వ అధికారులతోపాటు స్థానిక ప్రజా ప్రతినిధులను కూడా బాధ్యుల్ని చేస్తూ పకడ్బందీగా మున్సిపల్ చట్టాన్ని రూపొందించాలని ఆదేశించారు. ఈ చట్టం ఎంత మెరుగ్గా రూపొందించగలిగితే.. ప్రజలకు అంత గొప్ప సేవలను అందించగలుగుతామని సీఎం అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆరూరు రమేశ్, ప్రభుత్వ సలహాదారుడు రాజీవ్‌శర్మ, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, భూపాల్‌రెడ్డి, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, డీఎంఏ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Related posts