telugu navyamedia
ట్రెండింగ్

పాక్ లో .. భారీ పేలుడు .. 16 మంది మృతి .. 25 మందికి గాయాలు..

huge balst in pak 16 died

పాక్ లోని క్వెట్టాల్లో నేడు శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 16 మంది దుర్మరణం పాలయ్యారు. 25 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల్లో నలుగురు ఫ్రాంటియర్ కార్ప్స్ కు చెందిన జవాన్లు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన పట్ల ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు.

క్వెట్టాలోని హజార్ గంజీ ప్రాంతంలోని కూరగాయల మార్కెట్ లో ఈ పేలుడు సంభవించింది. కూరగాయల మార్కెట్ కావడంతో స్థానికులు, దుకాణదారులు, కొనుగోలుదారులతో ఈ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. శుక్రవారం పూట ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించడానికి అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేయడానికి పెద్ద సంఖ్యలో స్థానికులు మార్కెట్ కు చేరుకున్నారు. అదే సమయంలో..బాంబు పేలుడు చోటు వారిని ఉలిక్కి పడేలా చేసింది. ఓ ట్రక్కులో మార్కెట్ తీసుకొచ్చిన బంగాళాదుంపల లోడులో బాంబును అమర్చినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన చోటు చేసుకున్న ప్రాంతంలో షితే, హజారా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. చాలామంది ఈ కూరగాయల మార్కెట్ లో దుకాణాలను ఏర్పాటు చేసుకుని జీవితాన్ని గడుపుతున్నారు. ఈ సామాజిక వర్గానికి చెందిన ప్రజలకు పాకిస్తాన్ లో మైనారిటీలుగా గుర్తింపు ఉంది. వారిని లక్ష్యంగా చేసుకుని పేలుడు చేపట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు తామే బాధ్యులమంటూ ఎవరూ ప్రకటించలేదని క్వెట్టా పోలీస్ అదికారి అబ్దుర్ రజాక్ చీమా తెలిపారు.

పేలుడు సంభవించిన ప్రదేశంలో భయానక వాతావరణం నెలకొంది. పేలుడు తీవ్రతకు సమీప భవనాలు ప్రకంపించాయి. పేలుడు ధాటికి మృతుల శరీరాలు ఛిద్రం అయ్యాయి. శరీర భాగాలు తెగిపడ్డాయి. ఏడుమంది సంఘటనాస్థలంలోనే మరణించారని అబ్దుర్ రజాక్ ధృవీకరించారు. సున్నీ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన అతివాద సంస్థలు ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు ఆయన తెలిపారు. కొన్ని సున్నీ ముస్లిం అతివాద సంస్థలు గతంలో ఇదే తరహా పేలుళ్లకు పాల్పడిన ఘటనలు ఉన్నాయని అన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. శక్తిమంతమైన ఇంప్రువైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)ని పేలుడు కోసం వినియోగించినట్లు ప్రాథమికంగా నిర్ధారించామని అబ్దుర్ రజాక్ తెలిపారు. మార్కెట్ కు తీసుకొచ్చిన బంగాళాదుంపల లోడులో దీన్ని అమర్చినట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అన్నారు. రిమోట్ కంట్రోల్ దాన్ని పేల్చి ఉంటారని అనుమానిస్తున్నామని చెప్పారు. పేలుడు సంభవించే సమయానికి మార్కెట్ లో సుమారు 50 నుంచి 60 మంది స్థానికులు ఉండి ఉంటారని అంచాన వేశామని, వారిలో చాలామంది గాయపడ్డారని అన్నారు. మిగిలిన వారిని ప్రత్యేక వాహనాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు.

huge balst in pak 16 diedహజారా సామాజిక వర్గానికి చెందిన ప్రజలపై ఇలాంటి దాడులు సహజమే. 2012 నుంచి 2017 మధ్యకాలంలో వేర్వేరు పేలుడు ఘటనల్లో 509 మంది హజారా సామాజిక వర్గ ప్రజలు దుర్మరణం పాలైనట్లు పాకిస్తాన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ చెబుతోంది. ఈ ఘటనల్లో 627 మంది గాయపడ్డారని ఇదివరకే ఓ నివేదికను రూపొందించింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని హజారా సామాజిక వర్గానికి చెందిన ప్రజలకు పాకిస్తాన్ ప్రభుత్వం రక్షణ కల్పిస్తోంది. దీనికోసం ఫ్రాంటియర్ కార్ప్స్ జవాన్లను నియమించింది. మార్కెట్ లో సంభవించిన పేలుడులో ఫ్రాంటియర్ కార్ప్స్ కు చెందిన నలుగురు జవాన్లు కూడా గాయపడ్డారు. క్వెట్టా పేలుడు ఘటనపై బలూచిస్తాన్ ముఖ్యమంత్రి జామ్ కమల్, ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సంతాపాన్ని తెలిపారు.

Related posts