telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సాంకేతిక

తప్పిపోయిన బాలికను .. కుటుంబంతో కలిపిన .. ఫేస్‌బుక్ ..

facebook logo

ఈ రోజుల్లో టెక్నాలజీ వల్ల లోకం నాశనమవుతుందని అనుకునేంతగా ఎన్నో ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అయితే తాజాగా ఇదే టెక్నాలజీ ఒక మంచిపని చేసి తనను ఇలాకుడా వాడుకోవచ్చని నిరూపించింది. ఇప్పటికే ఫేస్‌బుక్ ప్రేమల వల్ల మోసపోయిన వారిని చూసాం కాని ఇప్పుడు ఇదే ఫేస్ బుక్ ఓ తల్లి కూతుళ్లని కలిపింది.. వివరాలు పరిశీలిస్తే. నాలుగున్నరేళ్ల వయసులో కుటుంబానికి దూరమైంది. కన్నవారికి, సొంత ఇంటికి దూరంగా 15 ఏళ్లు పెరిగింది. చిన్నతనంలోనే తప్పి పోవడంతో తనకున్న కొద్దిపాటి జ్ఞాపకాలతో కుటుంబసభ్యు లెవరో తెలుసుకోగలిగింది. దీనికి సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ వేదిక కావడం గమనార్హం. విజయవాడ పడమటలంకలో వెలుగుచూసింది.. జయరాణి అనే మహిళ పడమటలంకలో ఇద్దరు కుమార్తెలతో కలిసి నివాసం ఉంటోంది. ఈమె 15 ఏళ్ల క్రితం జయరాణి హైదరాబాద్‌లో పనికి వెళ్లిన సమయంలో ఓ ఇంటి వద్ద భవానీ కనిపించింది. భవానీ గురించి చుట్టుపక్కల వారిని వివరాలు అడిగినప్పటికీ ఎవరూ ఏమీ చెప్పలేదు. చిన్నారిని వెతుక్కుంటూ ఎవరైనా వస్తే తమకు సమాచారం ఇవ్వాలని సనత్‌నగర్‌ పోలీసు స్టేషన్‌లో జయరాణి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత హైదరాబాద్‌ నుంచి విజయవాడ వచ్చిన జయరాణి 15 ఏళ్లుగా ఇక్కడే పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.

ఇందులో భాగంగా విజయవాడ పడమటలంక వసంత సదన్‌ అపార్ట్‌మెంట్‌లో వంశీధర్‌ ఇంట్లో పనిచేస్తున్న ఈ మహిళ భవానీని కూడా పనిలో పెట్టాలనే ఉద్దేశంతో మొదటిసారి యజమాని వంశీ, అతని భార్య కృష్ణకుమారికి పరిచయం చేసింది. భవాని వయస్సు చిన్నది కావడంతో ఆమె గురించి వివరాలను ఆరా తీశారు. భవానీ చెప్పిన వివరాలను వంశీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. ఈ క్రమంలో భవానీకి సంబంధించిన ఫేస్‌బుక్‌ పోస్ట్‌ చూసిన విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన కుటుంబం ఫేస్‌బుక్ ద్వారా వంశీకి వీడియోకాల్‌ చేశారు. వీడియోకాల్‌ చేసిన అతన్ని సోదరుడిగా భవానీ గుర్తుపట్టింది. ఆమె తల్లిదండ్రులు కూడా వీడియోకాల్‌ ద్వారా భవానీతో మాట్లాడారు. త్వరలోనే కన్నతల్లిదండ్రులను కలుస్తానని భవానీ ఆనందం వ్యక్తం చేసింది. భవానీ సమాచారం తెలిసిన తల్లిదండ్రులు మాధవరావు, వరలక్ష్మీ, సోదరులు సంతోష్‌, గోపి విజయవాడకు బయలు దేరారు. చూశారుగా టెక్నాలజీని మంచిగా ఉపయోగిస్తే ఏ సమస్యనైన దాదాపు పరిష్కరించవచ్చు.

Related posts