telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఆస్తులు అమ్ముకోవడం తప్ప.. కేంద్రం చేసే అభివృద్ధి ఏమీ లేదా.. : మమతా

mamata benerji

కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)లో పెట్టుబడులను ఉపసంహరించుకుంటామంటూ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రతిపాదించడం పట్ల ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దీనిపై దేశవ్యాప్త ఆందోళనను చేపట్టడానికి సిద్ధపడుతున్నాయి. ఎల్ఐసీ బచావో నినాదంతో ప్రతిపక్ష పార్టీలన్నింటినీ మరోసారి ఏకం చేస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇదివరకే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఎయిరిండియాలో వందశాతం వరకూ తన వాటాను విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రైవేటు రైళ్లకు అనుమతులు ఇచ్చింది. తేజస్ పేరుతో నడుస్తోన్న రైళ్లు ప్రైవేటు సంస్థలకు చెందినవే. భారత్ పెట్రోలియం, షిప్పింగ్ కార్పొరేషన్‌లల్లో డిజిన్వెస్ట్‌మెంట్‌ను ప్రతిపాదించింది. ఇదే జాబితాలో తాజాగా ఎల్ఐసీ, ఇండిస్ట్రీయల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ)లను చేర్చింది.

నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టిందని, ఈ అయిదేళ్ల వ్యవధిలో ఏమీ మిగిల్చేలా కనిపించట్లేదని మమతా బెనర్జీ ఆరోపించారు. ఎల్ఐసీలో వాటాలను విక్రయిస్తామంటూ నిర్మలా సీతారామన్ ప్రస్తావించడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల శకానికి చరమగీతం పలకడానికి కేంద్రం కుట్ర పన్నిందని విమర్శించారు. దేశ చారిత్రక వారసత్వ సంపదగా వస్తోన్న కొన్ని కట్టడాల నిర్వహణను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిందని, వాటిని హోటళ్లుగా తీర్చిదిద్దిందని అన్నారు.

Related posts