telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పుంజుకున్న ప్రత్యర్ధుల బలం..ఆ మంత్రుల గెలుపు కష్టమే!

AP Assembly contest candidates

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ రాజకీయాలు రోజు రోజుకు మలుపులు తిరుగుతున్నాయి. గత ఎన్నికల్లో విజయం సాధించి చంద్రబాబు కేబినెట్‌లో అవకాశం దక్కిన కొందరు మంత్రుల పై వారి నియోజకవర్గాల్లో వ్యతిరేక పవనాలు వీస్తున్నట్టు తెలుస్తోంది. వాళ్ళు ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. మరో వైపు ప్రత్యర్ధులు బలం పుంజుకోవడంతో గట్టి పోటీ ఎదురుకుంటున్నారు. ఇలా తీవ్ర పోటీ ఎదుర్కుంటున్న మంత్రుల్లో కింజరాపు అచ్చెన్నాయుడు ఒకరు.

గత ఎన్నికల్లో టెక్కలి నుంచి విజయం సాధించి రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ప్రజల్లో కొంత వ్యతిరేకత తెచ్చుకున్నారు. ఈ వ్యతిరేకత రావడానికి ఆయన వ్యవహారశైలే ప్రధాన కారణమని తెలుస్తోంది. పైగా వైసీపీ నుంచి పోటీ చేస్తున్న పేరడా తిలక్ కూడా ఇక్కడ బలంగా ఉండటంతో అచ్చెన్న గెలుపు కోసం కష్టపడుతున్నారు. పైగా ఈ సారి టెక్కలిలో 45 వేల పైచిలుకు ఉన్న కాళింగ సామాజికవర్గం పార్టీలకు అతీతంగా తమ సామాజికవర్గానికి చెందిన తిలక్‌ను గెలిపించుకోవాలన్న కసితో ఉంది. ఇక అచ్చెన్న వర్గమైన కొప్పుల వెలమ ఓట్లు కేవలం 7 వేలు మాత్రమే. ఈ లెక్కన చూస్తే ఈ సారి అచ్చెన్న గెలుపు కష్టమేనని ఆ ప్రాంత వాసులు అంటున్నారు.

విశాఖపట్నంలో ఇద్దరు మంత్రులు ఎదురీతున్నట్లు తెలుస్తోంది. విశాఖ నార్త్ నుంచి పోటీ చేస్తున్న గంటా శ్రీనివాసరావు, నర్సిపట్నం నుంచి పోటీ చేస్తున్న చింతకాయల అయ్యన్నపాత్రుడు వీరిద్దరు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రతిసారి నియోజకవర్గం మారి గెలిచే గంటా ఈ సారి కూడా నార్త్‌కు వెళ్లారు. అయితే ఇక్కడ బీజేపీ, వైసీపీ నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదురవుతోంది. దీంతో ఈసారి గంటా గట్టెక్కడం అంతా సులువు కాదని తెలుస్తోంది.

2014లో తూర్పు గోదావరి పెద్దాపురం నుంచి పోటీ చేసి గెలిచి హోం మంత్రి, డిప్యూటీ సీఎం అయిన చినరాజప్పకి ఈసారి గెలవడం కష్టమే అని తెలుస్తోంది. ఈయనకి తోట నరసింహం భార్య వాణి గట్టి పోటీ ఇస్తుంది. జనసేన వలన కూడా రాజప్పకి నష్టం జరగొచ్చని సమాచారం. ఇక కృష్ణా జిల్లా మైలవరం బరిలో ఉన్న మరో మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు గెలుపు కోసం పోరాడుతున్నారు. మచిలీపట్నం నుంచి పోటీ చేస్తున్న కొల్లు రవీంద్ర…వైసీపీ, జనసేన అభ్యర్ధుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. 

ఇక గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న సీఎం తనయుడు, ఐటీ మంత్రి నారా లోకేశ్ కూడా ఎదురీతున్నారు. లోకేశ్ పట్ల స్థానికుల్లో వస్తున్న వ్యతిరేకతతో పాటు…వైసీపీ అభ్యర్ది ఆళ్ళ రామకృష్ణారెడ్డి బలంగా ఉండటం వలన గెలుపు కష్టతరంగా మారింది.  గుంటూరులో వేమూరు నుంచి పోటీ చేస్తున్న నక్కా ఆనందబాబు ఈ సారి గెలవడం కష్టమని తెలుస్తోంది. అటు నెల్లూరు సిటీ బరిలో ఉన్న మంత్రి నారాయణ, సర్వేపల్లి బరిలో ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు విజయం సాధించటం అంతా సులభం కాకపోవచ్చని తెలుస్తోంది. చూడాలి మరి ప్రత్యర్ధుల పోటీ తట్టుకుని ఈ మంత్రుల్లో ఎవరు విజయం దక్కించుకుంటారో వేచిచూడాలి మరి.

Related posts