telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

అమెజాన్ అలెక్సా ఆ రహస్యాలనూ రికార్డు చేస్తోందట…!?

Amazon

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) కీలకపాత్ర పోషిస్తోంది. గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు ఏఐ అభివృద్ధి కోసం కోట్లు ఖర్చు పెడుతున్నాయంటే దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ ఏఐ పరికరాలతో మనుషుల వ్యక్తిగత ప్రైవసీకి భంగం వాటిల్లుతోందని కొందరు అంటున్నారు. దీనికి కారణం అమెజాన్ అలెక్సా… ‘అలెక్సా’ అనే పదం వినపడగానే ఈ స్పీకర్ యాక్టివేట్ అయిపోతుంది. అక్కడి నుంచి దానికి వినబడిన ప్రతి మాటను, శబ్దాన్ని రికార్డు చేసేస్తుంది. దీని వల్ల భార్యభర్తలు రహస్యంగా మాట్లాడే మాటలు, సరసాలాడుకునే శబ్దాలు కూడా ఈ స్పీకర్లు రికార్డు చేసేస్తున్నాయి. ఇటువంటి రికార్డింగుల వల్ల వినియోగదారుల ప్రైవసీకి భంగం కలుగుతుందని కొన్ని పత్రికలు అమెజాన్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాయి. దీనిపై స్పందించిన అమెజాన్ ప్రతినిధులు.. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని, తమ రికార్డులు ఎవరైనా వినాలా వద్దా అనే నిర్ణయం వినియోగదారులకే వదిలేస్తామని తెలిపారు. దీనికోసం వినియోగదారులకు ‘ఆప్ట్ అవుట్’ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు వెల్లడించారు. గూగుల్, యాపిల్ వంటి కంపెనీలకు కూడా ఇలాంటి స్మార్ట్ స్పీకర్ పరికరాలున్నాయి. కానీ వీటిలో రికార్డయ్యే మాటలను, తమ కంపెనీలో పని చేసే వారేకాక ఎవరూ వినడానికి వీల్లేకుండా ఆయా సంస్థలు చర్యలు తీసుకున్నాయి. అమెజాన్ ఒక్కటే ఈ సదుపాయం ఇప్పటివరకు కల్పించలేదు. ఇక ఇప్పుడు అమెజాన్ కూడా ఈ సదుపాయాన్ని కల్పించనుంది.

Related posts