భారీ బడ్జెట్ తో తెరకెక్కే చిత్రాలకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రీమియర్ షోలకు, టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతిస్తున్న సంగతి తెలిసిందే.
ఈరోజు ప్రభుత్వ ఉన్నతాధికారులు, సినీ ప్రముఖులతో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సినిమా విడుదల అయ్యేటప్పుడు అప్పటికప్పుడు టికెట్ ధరలు పెంచుకోకుండా, ఒక సమగ్ర విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు.
ఇటు సినీ పరిశ్రమకు, అటు ప్రేక్షకులకు న్యాయం జరిగేలా టికెట్ రేట్లు ఉండేలా చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు.
సినిమా విడుదలైన ప్రతిసారి రేట్లు పెంచడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయని దుర్గేశ్ తెలిపారు.
ప్రతిసారి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని, టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి ఒకే జీవో ఉండేలా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఆర్టిస్టుల రెమ్యునరేషన్ పై కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

