telugu navyamedia
ఆంధ్ర వార్తలు

కొండపల్లి నగరపాలక సంస్థపై తెలుగుదేశం జెండా..

కృష్ణా జిల్లా కొండపల్లి నగరపాలక ఛైర్ పర్సన్ గిరిని తెలుగుదేశంపార్టీ కైవసం చేసుకుంది. తెలుగుదేశంపార్టీ తరఫున చైర్మన్ గా చెన్నుబోయిన చిట్టిబాబును, వైస్ చైర్మన్ – 1 గా ధరణికోట శ్రీలక్ష్మి, వైస్ చైర్మన్ – 2 గా చుట్టుకుదురు శ్రీనివాస్ ను ప్రతిపాదించారు. హైకోర్టు ఆదేశాలతో అధికారయంత్రాంగం పాలకవర్గ నియామక తంతును పూర్తిచేసి ఛైర్ పర్సన్, వైఎస్ ఛైర్ పర్సన్ల జాబితాను సీల్డుకవర్లో ఉంచిన అధికారులు హైకోర్టుకు నివేదించారు. భారీ పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తునడుమ అధికారయంత్రాంగం పాలకవర్గాన్ని ఏర్పాటు చేసింది. విజయవాడ ఎంపీ కేశినేని నాని సహా.. ఎన్నికల్లో గెలుపొందిన వార్డు సభ్యులు పోలీసు బందోబస్తుతో మునిసిపల్ కార్యాలయం చేరుకున్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున వార్డు సభ్యులు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం వచ్చారు.

తొలుత వార్డు సభ్యులుగా గెలుపొందిన అభ్యర్థులచేత అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. తర్వాత మెజారిటీ ఓట్లనుబట్టి పాలకవర్గాన్ని ఏర్పాటుచేశారు. 29 స్థానాలున్న కొండపల్లి నగరపాలక సంస్థలో 14 వార్డు స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్, 14 స్థానాలు తెలుగుదేశంపార్టీ చేజిక్కించుకున్నాయి. ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజయం సాధించిన శ్రీలక్ష్మీ తెలుగుదేశంపార్టీకి మద్దతు తెలపడంతో పాలకవర్గాన్ని ఏర్పాటుచేసే మెజారిటీ టీడీపీకి లభించింది. దీంతో రంగంలోకి దిగిన మాజీముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు… పాలక వర్గ నియామక బాధ్యతలను ఎంపీ కేశినేనినానికి అప్పగించారు.

ఎంపీ కేశినేని నాని ఎక్స్‌ అఫీషియో ఓటు చెల్లదంటూ వైకాపా సభ్యులు నిన్న ఎన్నికలో పాల్గొనలేదు. ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎన్నిక హాలు నుంచి బయటికి వచ్చారు. దీంతో గత రెండురోజులుగా మునిసిపల్ పాలక వర్గ నియామకంలో హైడ్రామా నడిచింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశంపార్టీ ఆరోపించింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి బాధ్యతాయుతంగా… సమర్థవంతంగా విధులు నిర్వర్తించి ఉంటే… ఇబ్బంది ఉండేది కాదని ఎంపీ కేశినేనినాని అభిప్రాయం వ్యక్తంచేశారు. అధికారుల ఉదాసీన వైఖరితో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొండపల్లి నగరపాలక సంస్థను చేజిక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేసింది. అనుచరవర్గంతో నిన్నగందరగోళ పరిస్థితి తీసుకొచ్చింది. పరిస్థితులను ముందుగానే అంచనా వేసిన పోలీసులు భారీగా మోహరించడంతో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని స్పష్టంగా తెలుస్తోంది.

హైకోర్టు ఆదేశాలతో అధికారయంత్రాంగం… పాలకవర్గనియామక ప్రక్రియను పూర్తి చేసింది. పోలీసులు భారీగా మోహరించారు. తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని తన అనుచరవర్గంతో మునిసిపల్ కార్యాలయం చేరుకున్నారు. తెలుగుదేశంపార్టీ నాయకులు దేవినేని ఉమను మాత్రం అనుమతించ లేదు. మునిసిపల్ కార్యాలయ ఆవరణలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Related posts