telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ లో విద్యుత్ వినియోదారులకు అధిక ఛార్జీల భారాన్ని తగ్గేలా చర్యలు తీసుకున్నాము: మంత్రి గొట్టిపాటి రవికుమార్

రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులందరికీ ఈ నెల నుంచే కరెంట్ బిల్లులు తగ్గేలా చర్యలు తీసుకున్నామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు.

గత ప్రభుత్వ హయాంలో విధించిన అధిక ఛార్జీల భారాన్ని తొలగిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని చౌడువాడ, కింతలి గ్రామాల్లో బుధవారం నూతనంగా నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాలను మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎఫ్‌పీపీ (ఇంధన, విద్యుత్ కొనుగోలు సర్దుబాటు) ఛార్జీల రూపంలో యూనిట్‌కు 40 పైసలు అధికంగా వసూలు చేసి పేద, మధ్యతరగతి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందని విమర్శించారు.

ప్రస్తుతం ఆ ఛార్జీని 13 పైసలకు తగ్గిస్తున్నామని, దీనివల్ల వినియోగదారులకు ఆర్థికంగా ఉపశమనం కలుగుతుందని వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నామని మంత్రి తెలిపారు.

ఇందులో భాగంగా 11 జిల్లాల్లో రూ. 250 కోట్ల వ్యయంతో 69 కొత్త విద్యుత్ ఉపకేంద్రాలను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.

దీంతోపాటు, రాష్ట్రంలోని 20 వేల ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఇళ్లపై ఉచితంగా సౌరవిద్యుత్తు యూనిట్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవల విద్యుదాఘాతానికి గురై మరణించిన ఇద్దరి కుటుంబ సభ్యులకు మంత్రి గొట్టిపాటి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

వారికి ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను అందజేశారు.

Related posts