telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“పుష్ప” నుంచి విజయ్ సేతుపతి తప్పుకోవడానికి కారణం ఇదే…!

mandi ad troubles vijay setupati

సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప’ సినిమాను పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు. తెలుగుతోపాటుగా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తు్న్నారు. ముత్తంశెట్టి మీడియా సౌజన్యంతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ లాక్‌డౌన్ సమయంలో షూటింగ్‌లకు ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చినా ఇంకా ‘పుష్ప’ షూటింగ్ తిరిగి ప్రారంభంకాలేదు. ‘పుష్ప’ సినిమాలో తమిళ నటుడు విజయ్ సేతుపతిని విలన్ పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారు. అయితే, కన్నడ నటుడు ధనుంజయ ఈ సినిమాలో నటిస్తున్నారనే వార్త బయటకు రాగానే విజయ్ సేతుపతి తప్పుకున్నారనే ప్రచారం మొదలైంది. దీనిపై తాజాగా విజయ్ సేతుపతి స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ తేదీలు సర్దుబాటు కాకపోవడంతో తాను ‘పుష్ప’ సినిమా నుంచి తప్పుకున్నానని చెప్పారు. డైరెక్టర్ సుకుమార్‌ను తాను స్వయంగా కలిసి తేదీల విషయాన్ని వివరించానని విజయ్ వెల్లడించారు. తనకు ఈ సినిమాలో చేయాలని ఉన్నప్పటికీ షూటింగ్ మొదలయ్యాక తనకు తేదీలు కుదరక ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. విజయ్ సేతుపతి తమిళంలో ఎంత బిజీనో అందరికీ తెలిసిందే. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అద్భుతంగా రాణిస్తున్నారు. ఇలాంటి సమయంలో వేరే భాషలలో తేదీలు సర్దుబాటు చేసుకుని సినిమాలు చేయడం కష్టమైన పనే. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా నటించారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు విజయ్ సేతుపతి హీరోగా నటిస్తోన్న ‘తుగ్లక్ దర్బార్’ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలైంది. మొత్తం మీద ప్రస్తుతం విజయ్ సేతుపతి చేతిలో 10 సినిమాలు ఉన్నాయి. తెలుగులో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతోన్న ‘ఉప్పెన’ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించారు.

Related posts