స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
తిరుమల ప్రపంచంలోని హిందువులందరికీ స్ఫూర్తి కేంద్రంగా అభివర్ణించారు.
భక్తులు సమర్పించే కానుకలు ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రధానంగా ఖర్చు చేయాలని వెంకయ్య సూచించారు.
ఆలయ నిధుల విషయంలో ప్రభుత్వాలు రాజకీయ జోక్యం చేసుకోకూడదన్నారు. భక్తులు సమర్పించే కానుకలు ఇతర కార్యక్రమాలకు మళ్లించవద్దని సూచనలు చేశారు.
ప్రతి ఊరిలో గుడి ఉండాలి. గుడి, బడి లేని ఊరు ఉండకూడదన్నారు వెంకయ్య నాయుడు. వీఐపీలు ఏడాదికోసారి మాత్రమే తిరుమల దర్శనానికి రావాలని సూచించారు.
ఏడాదికి ఒకసారి దర్శనానికి వచ్చే పద్ధతిని ప్రజాప్రతినిధులు పాటించాలన్నారు. వీఐపీలను పరిమితం చేస్తే సామాన్య భక్తులకు ఇబ్బంది ఉండదుని అన్నారు.
తిరుమలకు వచ్చే ప్రజాప్రతినిధులు మరింత బాధ్యతగా, హుందాగా వ్యవహరించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు.
“కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ తిరుమల శ్రీనివాసుని దర్శనానికి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చిన సందర్భంగా, ఇక్కడి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఆన్నప్రసాదాన్ని స్వీకరించడం ఆనందదాయకం.
చక్కని రుచితో పాటు, శుచిగా నిత్యం వేలాది మంది భక్తులకు స్వామి వారి అన్నప్రసాదం అందిస్తున్న ఈ కేంద్రం నిర్వహణా బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాను.
ఈ స్ఫూర్తిని అన్ని ఆలయాలు ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అని వెంకయ్య నాయుడు ట్వీట్ చేసారు.