నాలెడ్జి బేస్డ్ సొసైటీని తయారుచేయడంలో యూనివర్సిటీలదే కీలకపాత్ర అని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
రాష్ట్రంలోని పబ్లిక్ యూనివర్సిటీల వైస్ చాన్సలర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశానికి మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిధిగా హాజరు కాగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ విద్యారంగాన్ని నడిపించే నాయకులు, సంస్కరణల అంబాసిడర్లుగా వైస్ ఛాన్సలర్లు పనిచేయాలని కోరారు.
సమావేశానికి అధ్యక్షత వహించిన గౌరవ గవర్నర్‌కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పుట్టినరోజున కూడా సమావేశానికి హాజరైన గవర్నర్ అంకితభావం అందరికీ స్ఫూర్తి ఆన్నారు.
నా సుదీర్ఘపాదయాత్రలో ఆంధ్రప్రదేశ్ యువతను నేను ప్రత్యక్షంగా కలిసి వారి ఆశలు, ఆకాంక్షలను తెలుసుకున్నాను. వారిలో చాలామందికి సర్టిఫికెట్లు ఉన్నా, ఉన్నతవిద్య పూర్తిచేసి బయటకొచ్చినపుడు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు.
విద్యార్థులు, యువత ప్రశ్నలకు జవాబు చెప్పేందుకే సవాళ్లతో కూడిన విద్యాశాఖను తీసుకున్నాను. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసినప్పుడు ఆయన ఒక కీలక రాజకీయ ప్రముఖుడు హెచ్ ఆర్ డి శాఖను చేపట్టటం ఇదే మొదటిసారి చూశాను అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగ అభివృద్ధిపై మాకు గల నిబద్ధతకు ఇదే నిదర్శనం.

