నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించనున్నట్లు ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు.
సోమవారం జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డితో కలిసి ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాను కలిశారు. కార్యాలయ ప్రారంభోత్సవ అధికారిక ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవంతో పాటు బోర్డు అధికారిక లోగోను కూడా అమిత్ షా ఆవిష్కరిస్తారని వెల్లడించారు.
పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రధాని మోదీ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారన్నారు. ఈ కార్యక్రమం జూన్ చివరి వారంలో ఉంటుందని స్పష్టం చేశారు. కచ్చిత మైన తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు.
రాష్ట్ర సర్కార్ సైతం ఈ విషయంలో తనవంతు పాత్రను పోషిస్తోంది. నిజామాబాద్‌లోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని జాతీయ పసుపు బోర్డుకు కేటాయిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది.